Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనతో పాటు మరో ఐదుగురు నిర్దోషులే
- ప్రకటించిన బాంబే హైకోర్టు
- నిందితులను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
- తీర్పును స్వాగతించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టుచేసిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఇతర నిందితులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన నాగాపూర్ ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధిస్తూ 2017లో ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సాయిబాబా పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. యూఏపీఏ కేసులో నిందితులుగా ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, పాండు పోరా నరోటే, మహేష్ తిర్కీ, హేమ్ కేశ్వదత్త మిశ్రా, ప్రశాంత్ రాహి, విజరు నాన్ టిర్కీ ఉన్నారు. వీరిలో పాండు పోరా నరోటే 2022 ఆగస్టులో మరణించారు.
''ఉగ్రవాదం జాతీయ భద్రతకు ముప్పు. అప్పుడు దానికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన బలగాలు ఆయుధాలతో మోహరించాలి. అయితే పౌర ప్రజాస్వామ్యం నిందితులకు కల్పించిన విధానపరమైన భద్రతలను త్యాగం చేయదు'' అని డివిజన్ బెంచ్ తీర్పులో పేర్కొంది. ''నిందితులకు చట్టపరంగా అందించబడిన రక్షణ, ఎంత చిన్నదైనప్పటికీ రక్షించబడాలని మేము కోరుకుంటున్నాం'' అని తెలిపింది. 'సెషన్స్ జడ్జి అసమంజసమైన పరిశీలనలను మేం ఆమోదించటం లేదు' అని హైకోర్టు పేర్కొంది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సుబోధ్ ధర్మాధికారి, న్యాయవాదులు ప్రదీప్ మంధ్యాన్, బరుణ్కుమార్, హెచ్పి లింగాయత్, నిహాల్ సింగ్ రాథోడ్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే, అసిస్టెంట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్ఎస్ చిలాలీ వాదనలు వినిపించారు. పోలియో పక్షవాతం కారణంగా చక్రాల కుర్చీలో ఉన్న సాయిబాబా, వైద్య కారణాలతో తన శిక్షను నిలిపివేయాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు.
రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్)తో సంబంధమున్న ఆరోపణలపై యూఏపీఏలోని సెక్షన్లు 13,18, 20, 38, 39, ఐపీసీ 120 (బీ) సెక్షన్లు 13, 18, 20, 38, 39 కింద కేసులు నమోదు చేశారు. నిందితులను 2014లో అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలు, దేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడినందుకు దోషులుగా నిర్ధారిస్తూ 2017 మార్చిలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఏడేండ్ల జైలు జీవితం తరువాత ఆరోగ్యం క్షీణించింది : సాయిబాబా భార్య వసంత కుమారి
ఏడేండ్ల జైలు జీవితం తరువాత సాయిబాబా ఆరోగ్యం క్షీణించిందని ఆయన భార్య వసంత కుమారి అన్నారు. 'అతను ఒక మేధావి. ఉపాధ్యాయుడు, అతనిని కేసులో ఇరికించబడ్డారు' అని తెలిపారు. ''అతను నిర్దోషిగా విడుదలవుతారని మాకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థకు, మాకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు' అని అన్నారు.
తీర్పు స్వాగతించదగినది : సీపీఐ(ఎం)
ప్రొఫెసర్ సాయిబాబా, మరో ఐదుగురు అమాయకులను నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పును సీపీఐ(ఎం) స్వాగతించింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబా, అమాయక గిరిజనులను ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అన్నారు. రాజకీయ ప్రేరేపితంగా, అక్రమంగా కేసులు పెట్టారని విమర్శించారు. క్రూరమైన యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో గత రెండేండ్లలోనే దేశవ్యాప్తంగా 4,960 మందిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారని విమర్శించారు. తీర్పును స్వాగతిస్తున్నామనీ, అలాగే యూఏపీఏను రద్దు చేయాలనీ, రాజకీయ ప్రేరేపిత నకిలీ కేసుల్లో అరెస్టు అయినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భీమా కోరెగాం కేసులో అరెస్టయిన వారిని కూడా విడుదల చేయాలని కోరారు. యూఏపీఏ చట్టం పూర్తిగా ప్రజాస్వామ్య హక్కులను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. దేశ ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తోందని పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడినందుకు సాయిబాబాకు, ఆయన కుటుంబానికి అభినందనలు తెలిపారు. న్యాయం కోసం పోరాడేవారికి స్ఫూర్తి అన్నారు.