Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీన్ని విస్తృతంగా విచారించాల్సి ఉంది
- సుప్రీం కోర్టులో ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్
న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రజాస్వామ్య మూలాలకు దెబ్బ అనీ, దీనిని విస్తృతంగా విచారించాల్సి ఉందని సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషన్, కపిల్ సిబల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లపై సీపీఐ(ఎం)తో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు దాఖలు చేసిన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ప్రజాస్వామ్య మూలాలను ఎలక్టోరల్ బాండ్ల పథకం దెబ్బతీస్తోందని అన్నారు. ఈ సమస్యలు ప్రజాస్వామ్యానికి మూలాధారంగా ఉన్నాయని, ఎక్టోరల్ బాండ్లను అనుమతించే సవరణలు, అనుబంధ సంస్థలతో కూడా అపరిమిత విరాళాలు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో పునరాలోచన మార్పులను తాము సవాల్ చేశామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఎలక్టోరల్ బాండ్ల పథకం అత్యంత పారదర్శకంగా ఉందనీ, ఈ పథకంలో నల్లధానానికి ఆస్కారం లేదనీ, ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందనడం తప్పుఅని అన్నారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా వాదనలు వినిపిస్తూ తాము లేవనెత్తిన అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఈ అంశాలన్ని విస్తృతంగా విచారించాల్సి ఉందని తెలిపారు. దీనికి స్పందించిన జస్టిస్ గవారు తాము ఈ అంశాన్ని విచారిస్తామనీ, కేసును ఎప్పటికి జాబితా చేయాలని అడిగారు. దీనికి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి జోక్యం చేసుకొని అత్యవసరం ఏమీ లేదనీ, జనవరి 2023లో జాబితా చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, సంజరు హెడ్గే గుజరాత్లో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారని, జనవరిలో విచారణ జరగడమంటే బాండ్ల విక్రయం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. నవంబర్లో ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. దీంతో డిసెంబర్ 6 నాటికి కేసును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.