Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ హైకోర్టు ఆదేశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి
- ప్రభుత్వ కంపెనీకి నష్టం కలిగించి, ప్రయివేటుకు ప్రయోజనమా?
- గుజరాత్ హైకోర్టు ఆదేశాలను రద్దుచేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ :అదానీ పోర్ట్స్‌కు ఉపశమనం ఇస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అంతే కాకుండా హైకోర్టు చేసిన పరిశీలనలు ఆశ్చర్యానికి గురి చేశాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగ సంస్థకు నష్టం కలిగించేలా, ప్రయి వేట్ కంపెనీకు లాభం చేకూర్చేలా హైకోర్టు ఆదేశాలున్నాయని పేర్కొంది. మూడు నెలల్లోగా సెజ్ కంప్లైంట్ యూనిట్‌గా వేర్‌హౌసింగ్ సదుపాయాన్ని ఆమోదించడంలో, మాఫీ చేయడంలో సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) విఫలమైతే, ముంద్రా పోర్టుకు ఆనుకొని ఉన్న 34 ఎకరాల భూమిని అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ ఎస్ఈజెడ్ఎల్) స్వాధీనం చేసుకోవడాన్ని గుజరాత్ హైకోర్టు సమర్థవంతంగా అనుమతించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీడబ్ల్యూసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సిటి రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీఎస్ఈజెడ్ఎల్, సీడబ్ల్యూసీ మధ్య వివాదం కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది. హైకోర్టు అనుసరించే విధానం సమతుల్యంగా ఉండాలని పేర్కొంది. చట్టబద్ధమైన ప్రభుత్వ కార్పొరేషన్‌కు నష్టం కలిగించే విధంగా, ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చే విధంగా సెలిట్మెంట్ ఉండకూడదని పేర్కొంది. ''చట్టబద్ధమైన కార్పొరేషన్, ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాలను సమతుల్యం చేయడంలో సమస్య ఉన్నప్పుడు హైకోర్టు విధానం సమతుల్యమైనదిగా ఉండాలి. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే చట్టబద్ధమైన కార్పొరేషన్ అయిన పిటిషన్‌దారు సిడబ్ల్యుసి ప్రయోజనాలలు కాపాడలేం. ఒక సెటిల్మెంట్ చేయాలంటే, అది రెండు పక్షాల ప్రయోజనాలకు సంబంధించినదిగా గుర్తించాలి. అయితే చట్టబద్ధమైన కార్పొరేషన్‌కు హాని కలిగించేలా, ఒక ప్రయివేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా చేయడం సాధ్యం కాదు'' అని ధర్మాసనం పేర్కొంది. అలాగే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను కొట్టి వేసింది. ఈ విషయాన్ని మళ్లీ హైకోర్టు సింగిల్ జడ్జికి పరిశీలన కోసం పంపారు. వీలైనంత త్వరగా, ఆరు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పిటిషనర్ సిడబ్ల్యుసి తరపు న్యాయవాదులు మణిందర్ సింగ్, ప్రతివాది ఏపీఎస్ఈజెడ్ఎల్ తరపున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.