Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత బలోపేతం కావాలి
- సోషలిజంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాలి : డి రాజా వక్కాణింపు
- ప్రారంభమైన సీపీఐ 24వ జాతీయ మహాసభ
అమరావతి : కేంద్రంలో ఉన్న పెట్టుబడిదారీ అనుకూల, మితవాద బీజేపీ-ఆర్ఎస్ఎస్లను గద్దె దించే చారిత్రక బాధ్యత వామపక్షాలదేనని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పారు. ఆ దృష్టితోనే వామపక్షాల ఐక్యత, లౌకిక, ప్రజాస్వామ్య, దేశభక్తుల మధ్య ఐక్యత పెంపొందాలని సీపీఐ కోరుకుంటోందని అన్నారు. మెరుగైన ప్రపంచం, మంచి సమాజం కోసం విప్లవోత్సాహంతో కొనసాగేందుకు, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతానికి, సోషలిజం కోసం, ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ఈ మహాసభ దశా దిశా కాగలదని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న సిపిఐ 24వ జాతీయ మహాసభ శనివారమిక్కడ గురుదాస్ దాస్ గుప్తా నగర్ (ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్)లో ప్రారంభమైంది. ప్రతినిధుల సభను డి రాజా ప్రారంభించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముందుకొచ్చిన అమెరికా సామ్రాజ్యవాదానికి, ఫైనాన్స్ కేపిటల్‌కు, మితవాద, అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు సాగుతున్నాయనీ, ఆ అన్ని ఉద్యమాలకు సీపీఐ సంఘీభావం తెలుపుతోందన్నారు. దేశంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, వ్యవస్థల ధ్వంసం జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నారు. అంబానీ-అదాని కేపటలిజంతో కొంత మందివద్ద సంపద పోగు పడుతున్నది. మోడీ పగలూ రాత్రి పని చేస్తున్నారని బీజేపీ చెపుతున్నది. నిజమే కార్పొరేట్లకు దోచి పెట్టడానికి ఆ విధంగా తీరిక లేకుండా పని చేస్తున్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లను రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగానూ ఓడించాలి. మన సమాజంలో వేళ్లూనుకున్న కుల, పితృస్వామిక అణచివేతలను ఓడించడం ద్వారానే బీజేపీ-ఆర్ఎస్ఎస్లను నిలువరించగలుగుతాం. ఆర్ఎస్ఎస్ గతాన్ని పునర్వచించి వారసత్వాన్ని సముచితం చేయాలని ప్రయత్నిస్తోంది, కబీర్దాస్, పెరియార్, నారాయణగురు, అంబేద్కర్ వంటి ప్రగతిశీల ఆలోచనాపరులు, రచయితలు, సంఘసంస్కర్తలు మన పోరాటంలో భాగం కావాలి. ఆర్ఎస్ఎస్ ద్వేషంతో సమాజాన్ని కలుషితం చేస్తోంది. సామరస్యం, ఐక్యతతో మనం ఎదుర్కోవాలి.
ప్రాథమిక డిమాండ్లివే
కోవిడ్ మన సమాజాన్ని దెబ్బతీసిందని రాజా చెప్పారు. ప్రయివేటుపై ఆధారపడటం వలన ఆరోగ్య మౌలిక రంగాలు దెబ్బతిన్నాయి. లక్షల మంది చనిపోయారు. విద్య ప్రయివేటీకరణతో చాలామందికి విద్య సుదూర స్వప్నమైంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మోడీ రాజ్‌లో నిరంతర పతనాన్ని చూస్తోంది. ప్రజారోగ్యం, ప్రభుత్వ విద్య, భూమి, గృహ నిర్మాణం, ఆహార భద్రత మన ఎజెండాలో ప్రాథమిక డిమాండ్లుగా చేపట్టాలి. శ్రామిక వర్గాల కూర్పులో మార్పులను గమనించాలి. టెక్నాలజీని కోల్పోకూడదు. నిరాశతో యువ జనాభా బలవుతోంది.
లెఫ్ట్ చొరవ చూపాలి
ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా సాధించాలన్న ఆర్ఎస్ఎస్ ఎజెండాకు సీపీిఐ పూర్తి వ్యతిరేకమని రాజా చెప్పారు. ఆర్ఎస్ఎస్-బీజేపీని ఓడించే ప్రతిపక్షాల ఎజెండా భిన్నంగా ఉండాలి. సూత్రప్రాయ ఐక్యతను సుస్థిరం చేయడానికి లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల కేంద్రం ఏర్పడాలి. ఈ ఐక్యతను పెంపొందించేందుకు వామపక్షాలు చొరవ చూపాలి... అని రాజా కోరారు. తెలుగు ప్రాంతం కమ్యూనిస్టు ఉద్యమాలకు పెట్టని కోట అని, మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడే జరిగిందని, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చల పల్లి సుందరయ్య, బసవపున్నయ్య, రావి నారాయణరెడ్డి, నీలం రాజశే ఖర రెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్ వంటి మహనీయులను ఈ ప్రాంతం అందించిందని చెప్పారు. విజయవాడ నగరంలో ఇది మూడవ ఆలిండియా కాన్ఫరెన్స్ అని, ఇదొక అరుదైన చరిత్ర అని అన్నారు.
వామపక్ష ఐక్య సంఘటనకు కృషి: ఫార్వర్డ్ బ్లాక్ నేత దేవరాజన్
మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్ అన్నారు. మతోన్మాద మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దెదించాల్సిందేన న్నారు. దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు అవసరమని, కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని చెప్పారు. సిపిఐ 24వ జాతీయ మహాసభలో సౌహార్థ సందేశం ఇచ్చారు. ప్రజావ్యతిరేక విధానాలపై వామపక్షాలు ఐక్య ఉద్యమాలు చేపట్టి ప్రజలందరినీ సమీకరించాలని అన్నారు. వామపక్ష ఐక్య సంఘటన కోసం, ఆదిశగా భవిష్యత్ కార్యాచరణను మహాసభ సందర్భంగా సీపీఐ రూపొందిస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.