Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో మరోసారి దిగజారిన భారత్
- 101 నుంచి 107ర్యాంకుకు పడిపోయిన వైనం
- మన కంటే పొరుగుదేశాలు మెరుగు
- కేంద్రం బాధ్యత వహించాలి : ఏచూరీ
మోడీ సర్కారు దేశంలోని ప్రజల ఆకలిని తీర్చటం విఫలమవుతున్నది. పోషకాహారలోపం, చిన్నారుల్లో పెరుగుదల లోపం వంటి సమస్యలను పరిష్కరించటంలేదు. ఇందుకు ప్రపంచ ఆకలి సూచీలో దిగజారిన భారత ర్యాంకే నిదర్శనం. ఇందులో ఎప్పటిలాగే భారత్ ర్యాంకు మరోసారి పడిపోయింది. ఆర్థికంగా తనకంటే చిన్నవైన పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్‌లు భారత్ కంటే మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నాయి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఒక పక్క కేంద్రం చెప్పుకుంటున్నది. దేశంలోని ప్రజల ఆకలిని తీర్చలేని ఆర్థిక వ్యవస్థ ర్యాంకులు అర్థరహితమని నిపుణులు తెలిపారు.
న్యూఢిల్లీ : ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో భారత్ మరో సారి దారుణ ప్రదర్శను కనబర్చింది. గతంలో భారత ర్యాంకు 101గా ఉండగా.. అది ప్రస్తుతం 107కు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాలకు గానూ ప్రకటించిన ర్యాంకులలో భారత్ ఈ స్థానంలో నిలవటం గమనార్హం. దీనికి సంబంధించిన వార్షిక నివేదికను కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్తంగర్లైఫ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం.. 2021లో ప్రకటించిన ర్యాంకులలో 116 దేశాలలో భారత్ 101వ స్థానంలో ఉన్నది. అయితే, అది ఈ సారి 107కి పడిపోయింది. ఇక మనకంటే చిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న పొరుగు దేశాలు శ్రీలంక (64), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99)లు భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం 109వ ర్యాంకులో ఉన్నది. ముఖ్యంగా, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ కంటే మంచి స్థానాల్లో ఉండటం గమనార్హం.
ఐదు కంటే తక్కువ జీహెచ్ఐ స్కోరుతో చైనా, టర్కీ, కువైట్, బెలారస్, లాత్వియా, లితువేనియా, క్రొయేషియా, ఎస్టోనియా వంటి 17 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. జీహెచ్ఐ స్కోరు సున్నాగా ఉంటే మంచి స్కోరు (ఆకలి లేదు)గా పరిగణిస్తారు. అదే స్కోరు వందగా ఉంటే చెత్త ప్రదర్శనగా పేర్కొంటారు. జీహెచ్ఐ స్కోరు 9.9 కంటే తక్కువగా ఉంటే 'తక్కువ', 10-19.9 మధ్య ఉంటే 'మోస్తరు'గా, 20-34.9 మధ్య ఉంటే 'ఆందోళనకరం'గా, 50కి మీద ఉంటే 'తీవ్ర ఆందోళనకరం'గా పరిగణిస్తారు.
ఈ ర్యాంకింగ్‌లో భారత్ జీహెచ్ఐ స్కోరు 29.1తో 'తీవ్రమైన' కేటగిరిలో ఉన్నది. భారత జీహెచ్ఐ స్కోరు 2000 నుంచి క్రమంగా దిగజారుతూ వస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న భారత సరిహద్దు దేశం చైనా ఐదు కంటే తక్కువ జీహెచ్ఐతో 1 నుంచి 17 మధ్య ఇతర దేశాలతో ర్యాంకును సంయుక్తంగా పంచుకున్నది. 'తక్కువ' కేటగిరిలో 49 దేశాలున్నాయి. 'మోస్తరు' విభాగంలో 36 దేశాలు, 'తీవ్రమైన' కేటగిరిలో 35 దేశాలు, 'ఆందోళనకరం' లో 9 దేశాలున్నాయి. 'తీవ్ర ఆందోళనకరం'లో ఏ దేశమూ లేదు.
చిన్నారుల పెరుగుదల అంశం భారత్‌లో ఆందోళనకరంగా ఉన్నది. ఎత్తుకు తగిన బరువు లేని చిన్నారుల రేటు 19.3 శాతంగా ఉన్నది. కేంద్రంలో మోడీ ప్రభుతం అధికారంలోకి వచ్చిన 2014 (15.1 శాతం), 2000లో (17.15 శాతం) నమోదైన రేటు కంటే ఇది అధికంగా కావటం గమనార్హం. 2018-20లో 14.6 శాతంగా ఉన్న పోషకాహారలోపం 2019-21లో 16.3 శాతానికి పెరగటం ఆందోళనకరం. ఇక ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది చిన్నారులు పోషకాహారలోపంతో బాధపడుతుంటే.. ఇందులో భారత్ నుంచే 22.43 కోట్ల మంది ఉండటం గమనార్హం.
మోడీ అధికారంలోకి వచ్చాక మరింతగా... : ఏచూరీ
కాగా, ప్రతిసారీ ప్రపంచ ఆహార సూచీలో భారత్ దిగజారుతుండటంపై ప్రతిపక్షపార్టీల నాయకులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2014లో కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆకలిసూచీలో ఇది భారత్ దారుణమైన ప్రదర్శన అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ట్వీట్ చేశారు. మోడీ సర్కారు భారత్‌కు వినాశకరమైనదని వివరించారు. 8.5 ఏండ్లలో భారత్‌ను చీకటి యుగానికి తీసుకొచ్చినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
అసలు సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? : చిదంబరం
అసలు సమస్యలైన పోషకాహారలోపం, ఆకలి, చిన్నారుల్లో పెరుగుదల లోపంలను గౌరవ ప్రధాని ఎప్పుడు పరిష్కరిస్తారని రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశ్నించారు. 22.4 కోట్ల మంది భారతీయులు పోషకాహారలోపంతో బాధపడుతున్నాని భారత ర్యాంకును పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఈ జీహెచ్ఐ ర్యాంకును తిరస్కరించి అధ్యయనాన్ని నిర్వహించిన సంస్థపై దాడులు చేస్తుందని చిదంబరం కుమారుడు, లోక్‌సభ ఎంపీ కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు.
బీజేపీ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించటంపై ఉపన్యాసాలిస్తుందనీ, అయితే, 106 దేశాలు మన కంటే చక్కగా రోజుకు రెండు పూటలా భోజనాన్ని సమకూర్చుతున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఈ నివేదికను తప్పుబట్టింది. ఆకలి స్థాయిల్ని లెక్కించటానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ నివేదికను ఖండించిన విషయం విదితమే.