Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకాలు లేవు.. ఖాళీగా పోస్టులు
- దేశవ్యాప్తంగా సమాచార కమిషన్ల పనితీరుపై తీవ్ర ప్రభావం
- కొన్ని ఎస్ఐసీలు పూర్తిగా నిష్క్రియాత్మకం : ఎస్ఎన్ఎస్ నివేదిక
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయా లు, సంస్థల నుంచి సమాచారాన్ని సామాన్య పౌరుడు పొందగలిగే వజ్రాయుధం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్). ఈ చట్టం అమలులోకి వచ్చి 17 ఏండ్లు గడుస్తున్నది. ఈ చట్టం కింద పౌర సమాజం నుంచి అనేక దరఖాస్తులు నమోదవుతున్నాయి. కానీ, సమాచార కమిషన్లలో నియామకాలు జరగకపోవటం, పోస్టులు ఖాళీగా ఉండటంతో అవన్నీ పెండింగ్లో ఉంటున్నాయి. ఇలాంటి పెండింగ్ కేసులు దేశవ్యాప్తంగా సమాచార కమిషన్ల వద్ద గుట్టలుగా పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే కొన్ని రాష్ట్ర సమాచార కమిషన్లు (ఎస్ఐసీ) అయితే పని చేయకుండా నిద్రావస్థలో ఉన్నాయి. మరికొన్నైతే ప్రధాన సమాచార కమిషనర్ లేకుండా నడుస్తున్నాయి. ఇంకొన్నింటిలో సిబ్బంది సంఖ్యను కుదించి నడిపించటం గమనార్హం. గతేడాది సమాచార కమిషన్ల ముందు పెడింగ్ కేసుల సంఖ్య 59 వేలు పెరిగింది.
29 సమాచార కమిషన్ల పనితీరుపై నివేదిక
సమాచార కమిషన్లకు సంబంధించిన పనితీరుపై తులనాత్మక విశ్లేషణకు సంబంధించి విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత కొన్నేండ్లుగా భారత్లో సమాచార కమిషన్ల ప్రదర్శనపై పౌర సంఘం సతర్క్ నాగరిక్ సంఘటన్ (ఎస్ఎన్ఎస్) నివేదికను విడుదల చేసింది. యూపీఏ-1 హాయాంలో 2005, అక్టోబరు 12న ఆర్టీఐ యాక్ట్ అమలులోకి వచ్చింది. చట్టం వచ్చి సరిగ్గా 17 ఏండ్లు గడుస్తున్న సందర్భంలో జరిగిన అప్పీల్లు, ఫిర్యాదులు, సమాచారం వెల్లడి, పెండింగ్ కేసుల సంఖ్యకు సంబంధించి దేశంలో ఉన్న అన్ని 29 సమాచార కమిషన్ల పనితీరుపై విశ్లేషణ చేసి ఒక నివేదికను ఎస్ఎన్ఎస్ తయారు చేసింది.
తెలంగాణ, ఏపీలకు ప్రధాన (చీఫ్) సమాచార కమిషనర్లు లేరు
2021-22 ఏడాదికి సంబంధించిన ఈ నివేదిక సమాచారం ప్రకారం.. కొత్త కమిషనర్ల నియామకం జరగకపోవటంతో జార్ఖండ్, త్రిపుర లకు చెందిన రెండు సమాచార కమిషన్లు పూర్తిగా కార్యకలపాలు చేయటం లేదు. అంతకముందు ఏడాదిలో ఈ జాబితాలో ఉన్న మేఘాలయ ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మణిపూర్, పశ్చిమ బెంగాల్ ల ఎస్ఐసీ లు ప్రధాన సమాచార కమిషనర్ లేకుండానే పని చేస్తుండటం గమనార్హం. గతేడాది కూడా మణిపూర్, తెలంగాణ లకు ప్రధాన సమాచార కమిషనర్లను కలిగి లేవు. ఆర్టీఐ చట్టంలో వీరి పాత్ర కీలకమైందనీ, వారు లేకుండా సమాచార కమిషనర్ల పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని నివేదిక పేర్కొన్నది.
పేరుకుపోతున్న కేసులు
సిబ్బంది కొరతతో అనేక సమాచార కమిషన్లు నిష్క్రియాత్మకంగా ఉన్నాయి. కేంద్ర సమాచార కమిషన్లో మూడు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా పెండింగ్ కేసులు, అప్పీళ్ల సంఖ్య పెరుగుతున్నది. 2019, మార్చి 31 నాటికి పెండింగ్ కేసులు, అప్పీళ్ల సంఖ్య 46 వేలకు దగ్గరలో ఉన్నది. 2021, మే నాటికి అది 75 వేల వరకు చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి అది లక్ష వరకు చేరుకోవటం ఆందోళన కలిగిస్తున్నది.
ఇక రాష్ట్ర సమాచార కమిషన్లలో బ్యాక్లాగ్ అప్పీళ్లు, ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది, 26 సమాచార కమిషన్ల ముందు 2,55,602 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి పెండింగ్ అప్పీల్లు, ఫిర్యాదులు 3,14,323కి పెరిగాయి. 2019, మార్చి 31 నాటి గణాంకాలతో పోల్చి చూస్తే ఇది ఒక లక్ష అధికం కావటం గమనార్హం.
సమాచార బహిర్గతానికి ఏడాదికి పైనే సమయం
కమిషనర్ల నియామకాలు సరిగ్గా జరకపోవటం, పెండింగ్ అప్పీళ్లు, ఫిర్యాదుల కారణంగా దేశవ్యాప్తంగా 12 సమాచార కమిషన్లు ఒక విషయాన్ని బహిర్గతపర్చటానికి ఇప్పుడిస్తున్న సగటు రేటుపై ఆధారపడి చూస్తే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయని అంచనా. మరో 13 కమిషన్లు సగటున ఏడాదికి పైగా సమయాన్ని తీసుకుంటున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్ విషయంలో ఇది 24 ఏండ్ల మూడు నెలలుగా అంచనా వేయటం గమనార్హం.