Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి వద్దే ఉంచాలన్న విజ్ఞప్తీ తిరస్కరణ
- బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ
న్యూఢిల్లీ : మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. అలాగే సాయిబాబాను ఇంటి వద్దే ఉంచాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. హైకోర్టు కేసు మెరిట్స్ పరిశీలించకుండా, కేవలం సాంకేతిక కారణాల (టెక్నికల్ గ్రౌండ్స్)తోనే తీర్పు ఇచ్చిందని పేర్కొంది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిని విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. వాస్తవానికి శనివారం, ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు. అయినప్పటికీ శనివారం ఉదయం 11 గంటల కు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. తాము హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామనీ, అయితే ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. సాయిబాబాతో సహా ఇతర నిందితుల నుంచి నాలుగు వారాల్లో స్పందనలు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ''క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 390 కింద అధికారాలను ఉపయోగించడం, హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడం సరైనదని మేం అభిప్రాయపడుతున్నాం. ముందస్తు బెయిల్ పిటిషన్లో నిందితుల వైద్య కారణాలను హైకోర్టు తిరస్కరించింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు సస్పెండ్ చేస్తున్నాం. అయితే బెయిల్ కోసం వెళ్లేందుకు నిందితులకు అనుమతినిస్తున్నాం'' అని ధర్మాసనం పేర్కొంది.
సాంకేతిక కారణాలతో నిర్దోషులని ఎలా ప్రకటిస్తారు?తుషార్ మెహతా
మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ-ఉపా) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపి, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని అన్నారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారం గానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఉపా చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదన్నారు. సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తరువాత ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అయితే ఆయనకు బెయిల్‌ను కోర్టు తిరస్కరించిందని అన్నారు.
ఆయననెప్పుడూ దుర్వినియోగానికి పాల్పడలేదు
సాయిబాబా తరపున సీనియర్ న్యాయవాది ఆర్. బసంత్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేయొద్దని కోరారు. అభియోగాలు మోపిన తేదీ, పరిగణలోకి తీసుకున్న తేదీకి ఎలాంటి అనుమతి లేదని వాదించారు. సెక్షన్ 465 అనుమతి మంజూరులో అక్రమాల గురించి చెబుతుందని, అంతేతప్ప అనుమతి మంజూరు చేయకపోవడం గురించి కాదని స్పష్టం చేశారు. సాయిబాబాకు ఎటువంటి అనుమతి మంజూరు చేయలేదని అన్నారు. విచారణ సమయంలో అనుమతికి సంబంధించి ఏదైనా నిర్దిష్ట, స్వతంత్ర అభ్యంతరం లేవనెత్తారా? అని జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. దీనికి బసంత్ స్పందిస్తూ దరఖాస్తు చేయలేదనీ, కానీ క్రాస్ ఎగ్జామినేషన్ దశలో ఈ విజ్ఞప్తిని లేవనెత్తామని చెప్పారు. సాయిబాబాకు 55 ఏండ్లు, పెళ్లికాని 23 ఏళ్ల కుమార్తె ఉందని, 90 శాతం శారీరక అంగవైక్యంతో ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమై ఉన్నారనీ, ఆయనకు ఎటువంటి నేరపూరిత చరిత్ర లేదని తెలిపారు. 2015లో అరెస్టు అయ్యారనీ, ఏడేండ్లకు పైగా జైళ్లో ఉన్నారని తెలిపారు. సాయిబాబాకు ఇంతకు ముందు రెండు సార్లు బెయిల్ మంజూరు అయిందనీ, బెయిల్ షరతులను అతను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని ధర్మాసనానికి వివరించారు. ఆయనను తిరిగి జైలుకు పంపొద్దని, ఏవైనా షరతులు విధించి ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబాను సూత్రధారుడని ఆరోపిస్తోందని, అయితే ఇందులో అతని ప్రమేయం ఏమీ లేదని వాదించారు.
సాయిబాబా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం
వైద్య కారణాల రీత్యా సాయిబాబాను జైల్లో ఉంచడానికి బదులు, ఇంటి వద్దే (గృహ నిర్బంధంలో) ఉంచాలని న్యాయవాది బసంత్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ''సాయిబాబా ఆరోగ్యాన్ని కాపాడుకోనివ్వండి. దయచేసి ఆయనను ఇంట్లోనే ఉండనివ్వండి'' అని కోరారు. ఎస్జి తుషార్ మెహతా గృహ నిర్బంధం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.