Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచికోసం పోరాటం కొనసాగించాలి
- చట్టం విరుగుడు కాదు... రాజ్యాంగ విలువను నిలబెట్టే సాధనం:
న్యాయ విద్యార్థులకు జస్టిస్ డివై చంద్రచూడ్ సూచన
న్యూఢిల్లీ : చట్టంతో వ్యవహరించే విధానంలో స్త్రీవాద ఆలోచనను చేర్చాలని న్యాయశాస్త్ర విద్యార్థులకు తదుపరి సీజేఊ జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవంలో ఆయన శనివారం పాల్గొన్నారు. విద్యార్థినులు సాధించిన బంగారు పతకాలన్నీ మనం జీవిస్తున్న కాలానికి, రాబోయే కాలానికి సూచికలని పేర్కొన్నారు. వారు పతకాలు సాధించడంతో వ్యక్తీకరించే ఈ సామర్థ్యాన్ని సమాజంలోని వాస్తవమైన మార్పు తీసుకొచ్చేందుకు ఎలాంటి పరిస్థితులు సృష్టించాలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు. బాలికలను విద్యకు ప్రవేశం కల్పించి మొదటి సవాలు అధిగమించామని తాను నమ్ముతున్నానని అన్నారు. అయితే, యువతులు ప్రదర్శించే సామర్థ్యాన్ని భారతీయ సమాజంలో పరివర్తనగా మార్చడమే మన కాలపు నిజమైన సవాలు అని ఆయన అన్నారు. మనం పితృస్వామ్య వ్యవస్థలో పురుషాధిక్య సమాజంలో జీవిస్తున్నామని తెలిపారు. చట్టం విరుగుడు కాదని, రాజ్యాంగ విలువలు నిలబెట్టే సాధనమని పేర్కొన్నారు. మంచి కోసం పోరాటం కొనసాగించాలని సూచించారు.
యువ న్యాయవాదులు సాంప్రదాయ, లాంఛనప్రాయ విధానాలను కొనసాగించడం మానుకోవాలనీ, దానికి బదులు తమ అవసరాలు తీర్చుకోవడానికి రోజూ కష్టపడుతున్న ప్రజల జీవితాలను కేంద్రంగా ఉంచే చట్టపరమైన విధానాన్ని అవలంబించడానికి కృషి చేయాలని సూచించారు. అదే నిజమైన న్యాయమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళలకు న్యాయవాద వృత్తి నిరుత్సాహకరంగా, సవాలుగా అనిపించవచ్చని అన్నారు. అయినప్పటికీ, వారి మహౌన్నతమైన అంకితభావం ముందు అడ్డంకులు ఎక్కువగా ఉండవని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఎన్ఎల్యు ఛాన్సలర్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 160 మంది విద్యార్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టరల్ డిగ్రీలను పొందారు.