Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాక్ స్వాతంత్య్రం.. పత్రికా స్వేచ్ఛ లేదు..
- అమాయక పౌరులను జైళ్లకు పంపుతున్నారు : పీఏజీడీ
న్యూఢిల్లీ : కాశ్మీర్ ప్రజలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగిందని 'పీపుల్స్ అలయన్స్ గుప్కార్ డిక్లేరేషన్' (పీఏజీడీ) కూటమి నేతలు ఆరోపించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. ఇలాంటి చర్యలు రాష్ట్రంలో సర్వసాధారణమై పోయాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులేవీ రాష్ట్రంలో అమలు కావటం లేదని పీఏజీడీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంలోని మోడీ సర్కార్ జమ్మూకాశ్మీర్ ప్రజల్ని గాలికి వదిలేసిందని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ కనుమరుగు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఐ(ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి, ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ముజఫర్ షా, ఎన్సీపీ నాయకులు..అంతా ఫరూక్ అబ్దుల్లా నివాసంలో శనివారం సమావేశమయ్యారు.
ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని, కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్ర పరిస్థితి ఇంత దయనీయంగా తయారైందని పీఏజీడీ కూటమి ఆరోపించింది. కూటమి నేతల మధ్య శనివారం వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఓటర్ల జాబితా ఆధునీకరణ పేరుతో స్థానికేతరులకు ఓటర్ కార్డులు ఇస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని పీఏజీడీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. కాశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలు దీనిపై ఆందోళన చేపడుతున్నాయ ని తెలిపింది.
మేథావుల మౌనం దేశానికి నష్టం : యూసఫ్ తరిగామి
చర్చల అనంతరం సీపీఐ(ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి మాట్లాడుతూ..''ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పీఏజీడీ ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటికిపైకి వచ్చాయి. విభజన రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే ప్రజలంతా ఒక్కటవ్వాలి. న్యూఢిల్లీ పాలన కారణంగా కాశ్మీర్ ప్రజల మెడపై కత్తి వేలాడుతోంది. దీనిపై దేశంలోని మేథావులు గళం విప్పాలి.
వారి మౌనం కాశ్మీర్కే కాదు..దేశానికే తీవ్ర నష్టం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎవర్ని పడితే వారిని..ఎక్కడ పడితే అక్కడ అరెస్టులకు పాల్పడుతోంది. అమాయక పౌరులెంతో మంది జైలు పాలవుతున్నారు. జైళ్లలో ఖాళీలేనంతగా అరెస్టులు ఉన్నాయి'' అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానమూ బీజేపీ నెరవేర్చలేదని ఎన్సీ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. ''యువతకు 50వేల ఉద్యోగాలిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఏండ్లు గడుస్తున్నా..ఒక్క ఉద్యోగమూ రాలేదు.