Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రాజధానిపై సీపీఐ మహాసభ తీర్మానం
- తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్
అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారత కమ్యూనిస్టుపార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేసింది. మూడు రాజధానులను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ అంశం ప్రాంతీయ విబేధాలను సృష్టించేందుకు కారణమవుతోందని పేర్కొంది. ఈ మేరకు సిపిఐ జాతీయ మహాసభలో ఆదివారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అమరావతి రాజధాని అంశంపై రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా నిర్ణయించిందని తెలిపారు. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం-బీజేపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి కూడా సంపూర్ణ మద్దతును తెలిపిన విషయాన్ని తీర్మానంలో పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 34 వేల ఎకరాల భూములను ఆ ప్రాంత రైతాంగం త్యాగం చేసిందని,. ఎలాంటి నష్టపరిహారమూ ఆశించకుండానే రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇటువంటి త్యాగం మునుపెన్నడూ జరగలేదని తెలిపారు. అత్యంత విలువైన తమ వ్యవసాయ భూముల్లో కేవలం నాలుగో వంతు మాత్రమే తీసుకునేందుకు వారు అంగీకరించారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 2017 అక్టోబరు 22వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ కూడా చేశారని తెలిపారు.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ఉద్యోగుల నివాస భవనాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి సౌకర్యాలు, వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల్లో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి అమరావతి రాజధానిని విస్మరించిందని పేర్కొనారు. ఈ నిర్నయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారని, దాదాపు 1,100 రోజులకు పైగా వారి ఉద్యమం మహోద్యమంగా సాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతారు చేయడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ వైఖరిని రాజధాని రైతాంగం తీవ్రంగా నిరసిస్తోందని, రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొందని తెలిపారు.