Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో మూడు, ఏపీలో రెండు,
- బ్యాంకింగ్ వ్యవస్థతో దేశ ఆర్థిక ప్రగతి
- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల(డీబీయూ)ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోడీ వర్చువల్‌గా డీబీయూలను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్ దిశలో డీబీయూ ఒక పెద్ద అడుగని అన్నారు. కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ట సేవలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇవన్నీ ఎటువంటి రాతపని ప్రమేయం లేకుండా డిజిటల్‌గా జరుగుతాయని చెప్పారు. ఇది బలమైన, సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందించడంతోపాటు బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వారు రుణాలు పొందడానికి, నగదు బదిలీ వంటి ప్రయోజనాలు డీబీయూ ద్వారా పొందుతారని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థతోనే దేశ ఆర్థిక ప్రగతి ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఫోన్ బ్యాంకింగ్ నుండి డిజిటల్ బ్యాంకింగ్‌కి మారడం దేశాన్ని స్థిరమైన వృద్ధిబాటలో ఉంచిందని అన్నారు. డీబీయూలు మరింత ఆర్థిక లావాదేవీలు, ప్రజల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. డిజిటలైజేషన్‌తో సామాజిక భద్రతకు భరోసా కల్పించడంలో ఇండియా అగ్రగామిగా మారిందని చెప్పారు. బ్యాంకింగ్ రంగం సుపరిపాలన, మెరుగైన సేవల పంపిణీకి మాధ్యమంగా మారిందని అన్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) లీకేజీలను అరికట్టడానికి, పారదర్శకతను తీసుకురావడానికి సహాయ పడిందని పేర్కొన్నారు. డీబీయూల ద్వారా నిరంతరం నగదు డిపాజిట్, ఉపసంహరణ, బ్యాంకింగ్ సేవలు అందుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఐదు డీబీయూలు
75 డీబీయూల్లో తెలంగాణలో మూడు, ఏపీలో రెండు ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మంలో సిటీ యూనియన్ బ్యాంకు, జనగాం, రాజన్న జిల్లాల్లోని ఎస్బీఐ డీబీయూలు ,ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కృష్ణా (మచిలీపట్నం) జిల్లాల్లోని యూనియన్ బ్యాంకుకు చెందిన డీబీయూలుఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తదితరులు పాల్గొన్నారు.