Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖర్గే, శశిథరూర్ అభ్యర్థులు
- దాదాపు 9,300 మంది ఓటర్లు
- యాత్ర సైట్ వద్దే రాహుల్ సహా 47 మంది ఓటు
న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి ఎన్నికలు నేడు (సోమవారం) జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ పదవికి పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌లు ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పర్యటించి నేతలను కలుసుకొని మద్దతు కోరారు. ప్రచార ప్రక్రియ కూడా ఆదివారం నాటికే ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9,300 మంది పైగా కాంగ్రెస్ నిర్వాహకులు ఓటర్లుగా ఉన్నారు. 36 పోలింగ్ స్టేషన్లలో 67 బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక బూత్ ఉంటుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతో పాటు, దేశంలోని అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయాల్లో పోలింగ్ జరుగుతుంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్స్‌లు ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (సీఈఏ) ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల పీసీసీలకు పంపింది. పోలింగ్ కోసం పీసీసీ కార్యాలయాలలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ సర్వసభ్య మండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, సీడబ్ల్యూసీ సభ్యులు, రాష్ట్ర ఇన్చార్జిలు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయం (24 అక్బర్ రోడ్)లో తమ ఓటు వేసే అవకాశం ఉంది. బళ్లారిలోని సంగనకల్లులోని భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో రాహుల్ గాంధీతో పాటు 47 మంది పీసీసీ డెలిగేట్లు ఓటు హక్కు వినియోగించు కుంటారు. బెంగళూర్‌లోని పీసీసీ కార్యాల యంలో మల్లికార్జున్ ఖర్గే, తిరువనంతపురం లోని పీసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓటర్లకు నిబంధన లు...ఓటర్లందరికి 'క్యూ ఆర్' కోడ్‌తో కూడిన ఓటరు గుర్తింపు కార్డు అందజేశారు. ఓటు వేసేవారు తప్పకుండా ఓటింగ్ గుర్తింపు కార్డుతో వెళ్లాల్సి ఉంది. తొలుత వారి పేరు, ఊరు, పార్టీలో బాధ్యత తదితర వివరాలు నమోదు చేస్తారు. అనంతరం వారికి బ్యాలెట్ పేపరు అందజేయనున్నారు. బ్యాలెట్ పేపర్లో మొదటి పేరుగా మల్లికార్జున ఖర్గే పేరు ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించారు. ఆ తరువాత రెండవదిగా శశిథరూర్ పేరును ముద్రించారు. బ్యాలెట్ పేపర్లో ఏ రాష్ట్రం, ఓటరు నెంబర్, వరుస నెంబర్, స్థలం తదితరాలు అడిగి నమోదు చేస్తారు. అనంతరం ఓటరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి వెళ్లి, అక్కడే ఉంచిన బ్యాలెట్ పేపరుపై తమకిష్టమైన వారి పేరుకు ఎదురుగా ముద్ర వేయాల్సి ఉంటుంది. ఎన్నికల పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులకు సీలు వేసి ఢిల్లీకి పంపిస్తారు. ఈనె 19న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. 22 ఏండ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రతి అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఓటర్లు
ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులను ఎంపిక చేశామని ఢిల్లీ పీసీసీ రిటర్నింగ్ అధికారి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఏపీ భవన్ వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాల్లో మున్సిపల్ సీటు ప్రాతిపదికన ప్రతినిధుల ఎంపిక చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియపై విమర్శలు చేసేవాళ్లుముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీలో ఎన్నికల ప్రక్రియ లేకుండానే అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని విమర్శించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు.