Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలకు ప్రమాదం
- చిన్న ఓడరేవులపై పట్టుకు కేంద్రం తాపత్రయం
- రాష్ట్రాలు అధికారాలను, ఆదాయాన్ని కోల్పోతాయి
- ఇండియన్ పోర్ట్స్ బిల్లుపై పలు రాష్ట్రాల సీఎంలు, నిపుణుల ఆందోళన
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో మోడీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే విమానాశ్రయాలు, బ్యాంకులు, పోర్టుల ప్రయివేటీకరణ ప్రతిపాదనలతో దేశ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా దోచిపెట్టేందుకు దారులు తెరిచింది. ఇప్పుడు దేశంలోని చిన్న ఓడరేవుల (మైనర్ పోర్టులు)పై తన అధికారాన్ని మరింత విస్తృతం చేసుకోవటానికి మోడీ సర్కారు సిద్ధమైంది. ఇందుకు ఇండియన్ పోర్టు బిల్లును తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, కేంద్రం తీరుపై దేశంలోని ఆయా రాష్ట్రాల సీఎంలు, నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ బిల్లు ఫెడరలిజంపై దాడిగా వారు అభివర్ణించారు. పోర్టులపై రాష్ట్రాలు అధికారాలు కోల్పవటమేగాక ఆదాయానికి, ఉద్యోగాలకు దెబ్బ పడే ప్రమాదమున్నదని హెచ్చరించారు.
న్యూఢిల్లీ : దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు పంచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్నీ ఒదులుకోవటం లేదు. ఇందులో భాగంగా దేశంలోని చిన్న ఓడరేవులపై అధికారాన్ని చలాయించటానికి సిద్ధమవుతున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా దేశంలోని 13 మేజర్ పోర్టులను ప్రయివేటీకరించటానికి గతేడాది మేజర్ పోర్టు అథారిటీస్ యాక్ట్, 2021 (ఎంపీఏ) మార్గం సుగమం చేసిన విషయం విదితమే. దీంతో ప్రయివేటు సంస్థలు పోర్టుల నిర్వహణతో ఆదాయాన్ని గడిస్తున్నాయి. ఇప్పుడు తొమ్మిది తీర ప్రాంత జిల్లాల్లోని 187కు పైగా మైనర్ పోర్టులపై కేంద్రం తన అధికారాలను పెంచుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రతిపాదిత బిల్లును తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నదని నిపుణులు చెప్పారు. భారత్ 7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని, 14,500 కిలోమీటర్ల వ్యూహాత్మక జలమార్గాలను కలిగి ఉన్నది. దీని ద్వారా దేశంలో జరిగే ఎగుమతులు, దిగుమతుల్లో మైనర్పోర్టులు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్నీ తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మైనర్ పోర్టులు అనేవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రాష్ట్ర సముద్రతీర బోర్డుల కింద ఉన్నాయి. అయితే, ఈ మైనర్ పోర్టులపై అధికారం చలాయించేందుకు కేంద్రం ఇండియన్ పోర్టు బిల్లు, 2022తో ముందుకొస్తున్నది. ఈ బిల్లు కేంద్రం ద్వారా నియమింపబడే మేరిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎంఎస్డీసీ) కిందకు మైనర్ పోర్టులను తీసుకొచ్చేందు ప్రతిపాదిస్తున్నది. కాబట్టి, ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది అమలైతే దేశంలోని ఆయా రాష్ట్రాలు మైనర్ పోర్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతాయి. ఇటు ఇప్పటి వరకు పోర్టులపై రాష్ట్రాలకుండే అధికారాలూ దూరమవుతాయి.
తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్ల అభ్యంతరాలు
ఈ బిల్లుపై పలు రాష్ట్రాలు అభ్యంతరంతో ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్.. సవరించిన ముసాయిదా బిల్లులోని 'కేంద్రీకరించే' నిబంధనలను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేరళ సీఎం పిన రయి విజయన్.. స్టాలిన్‌కు మద్దతుగా నిలిచారు. అలాగే, ఒడిశా, గుజరాత్ ప్రభుత్వాలు కూడా ఇవే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అప్పటి కేంద్ర షిప్పింగ్ మినిస్టర్ మన్సూఖ్ మాండవీయ కు లేఖ రాశారు. సవరించిన ఇండియన్ పోర్టు బిల్లును కేంద్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసింది. ఎంఎస్డీసీ ఫెడరలిజానికి సహకరిస్తుందని ఆ సమయంలో కేంద్ర ఓడరేవుల మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ప్రస్తుతం కేవలం అడ్వైజరీ బాడీగా ఉన్న ఎంఎస్డీసీ.. పరిమిత సిబ్బందితో రెగ్యులేటరీ బాడీగా రాష్ట్రాల అధికారాలను దోచుకుంటుందని స్టాలిన్ తన అభ్యంతరంగా చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ లాగే ఎంఎస్డీసీ అడ్వైజరీ బాడీగా కొనసాగాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. వాటిలో కొన్ని నిబంధనలను తొలగించాలని వివరించారు.
మైనర్‌పోర్టుల పనితీరు భేష్
సముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు నిర్వహించే నాన్-మేజర్ పోర్టులు (మైనర్ పోర్టులు).. కేంద్రం పరిధిలోకి వచ్చే మేజర్ పోర్టుల కంటే చక్కని పనితీరుతో ఎగుమతులు, దిగుమతులు, ఆదాయం విషయంలో ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయి. ఇది అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో సాధ్యమైందని నిపుణులు వివరించారు. అయితే, రాష్ట్రాల అధికారాన్ని కేంద్రానికి బదలాయిస్తే మైనర్ పోర్టుల అభివృద్ధికి ముగింపు పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రతీర దేశాలైన యూఎస్, కెనడా, జపాన్, జర్మనీ లలో కేంద్రం ప్రతిపాది స్తున్నటువంటి వ్యవస్థ లేదనీ, అక్కడ మైనర్ పోర్టులపై స్థానిక యంత్రాంగాలకే అధికారాలుంటాయని ముంబయి లోని జేఎన్ పోర్టు మాజీ తాత్కాలిక చైర్మెన్ జోస్ పాల్ తెలిపారు.
ఉపాధికి దెబ్బ
మేజర్ పోర్టు అథారిటీస్ యాక్ట్, 2021తో దేశంలోని పోర్టుల నిర్వహణపై ప్రయివేటు భాగస్వామ్యం పెరిగింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అనేది పోర్టులలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు ముప్పుగా పరిణమించిందని నిపుణులు చెప్పారు. ఎంపీఏ యాక్ట్‌తో మేజర్ పోర్టులలో ఎగుమతులు-దిగుమతులు ప్రయివేటు పార్టీలకు అప్పగించటంతో అవి లాభాలను గడిస్తున్నాయని వివరించారు. రూ. 2500 కోట్ల వార్షికాదాయంతో ఉన్న జవహర్లాల్ నెహ్రూ పోర్టు (జేఎన్పీ) 700 మందికి కూడా ఉపాధి కల్పించటంలేదని తెలిపారు. ఇప్పుడు మైనర్ పోర్టులూ కేంద్రం చేతిలోకి వెళ్తే పరిస్థితులు మరింత కఠినంగా తయారయ్యి ఉపాధికి ఎసరు పడుతుందని వివరించారు. ఈ విషయంలో కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలు గట్టిగా పోరాడాలని నిపుణులు సూచించారు.