Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధి మైనస్ 0.8 శాతం
- మైనింగ్, వస్తు తయారీ, విద్యుదుత్పత్తి, టెక్స్టైల్స్..అన్నీ మైనస్‌లోకే..
- బడా కార్పొరేట్లను మోడీ సర్కార్ నమ్ముకున్న ఫలితమిది
- పెరిగిన నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణం
అత్యంత ధనికులు, బడా కార్పొరేట్స్ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మోడీ సర్కార్ బలంగా భావిస్తోంది. కరోనా సంక్షోభం సాకుగా చూపి (ఏప్రిల్ 2020) ఒక్క నెలలో దాదాపు లక్ష కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు కార్పొరేట్ రంగానికి అందజేసింది. అప్పట్నుంచీ ఆగస్టు 2022 వరకు ప్రతినెలా రూ.50వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు రుణాలుగా అందుతున్నాయి. అయినా..పారిశ్రామిక ఉత్పత్తి పడకేసింది. నిరుద్యోగం పెరిగింది. పర్మినెంట్, కాంట్రాక్ట్..అందర్నీ ఉద్యోగాల నుంచి తీసేసి కార్పొరేట్, ప్రయివేట్ రంగం వేతనాల బిల్లును తగ్గించుకున్నాయి. లాభాలు పోగేసుకున్నాయి. నేడు దేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అధిక ధరలతో సతమతమవుతోంది. మోడీ సర్కార్ ఆర్థిక విధానాల ఫలితమిది.
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం రాకముందుతో పోల్చితే నేడు ప్రజల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయి. అత్యంత ధనికులు, బడా కార్పొరేట్స్పైనా కరోనా ప్రభావం పడింది. అయినా..వారి లాభాల మార్జిన్ భారీగా పెరిగింది. ఆగస్టు, 2022 నాటికి బ్యాంకుల నుంచి భారీ పరిశ్రమలకు దక్కిన రుణాల మొత్తం రూ.24.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది డిసెంబర్ 2020లో సుమారుగా రూ.20లక్షల కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం తర్వాత ప్రతినెలా వేలకోట్లు, లక్ష కోట్లు..బ్యాంకుల నుండి కార్పొరెట్, ప్రయివేటు రంగానికి రుణాలుగా దక్కుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ పెంచడానికి ఉపాధి మెరుగుపర్చడానికి ఇదంతా చేశామని మోడీ సర్కార్ తన నిర్ణయాల్ని సమర్థించుకుంది. అయితే ఇది కేవలం సాకుమాత్రమేనని ఇప్పుడు తేలిపోయింది.
కీలకరంగాల్లో దెబ్బతిన్న వృద్ధి
పన్ను ప్రయోజనాలు, రుణ సౌకర్యం, కార్పొరేట్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా..పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడలేదు. ఫిబ్రవరి 2020లో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వృద్ధి 5.2శాతం నమోదుకాగా, ఆగస్టు 2022నాటికి 'మైనస్ 0.8'శాతానికి చేరుకుంది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఎన్నడూ పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడలేదు. గనుల తవ్వకం, వస్తు ఉత్పత్తి, విద్యుత్‌రంగాల్లో వృద్ధి దాదాపు స్తంభించింది. సుదీర్ఘకాలంగా (రెండేండ్లుగా) ఇది కొనసాగటం వల్లే నేడు దేశాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు చాలా కీలకమైంది. ఇది నేరుగా ఉపాధి, వేతనాలు, ధరలను ప్రభావితం చేస్తుంది.
ఇవన్నీ నేడు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని 'జాతీయ గణాంక కార్యాలయం' (ఎన్ఎస్వో) విడుదల చేసిన సమాచారమే చెబుతోంది. గనుల తవ్వకం 'మైనస్ 3.9శాతం', వస్తు తయారీ 'మైనస్ 0.7శాతం', విద్యుత్ ఉత్పత్తి 1.4శాతం వృద్ధి...నమోదు చేశాయి. వస్త్ర పరిశ్రమ, దుస్తుల తయారీ, తోలు, ఫార్మాస్యూటికల్స్..ఇవి 'మైనస్ రెండంకెల' వృద్ధితో ఉన్నాయి. భారత్ ఎగుమతులన్నీ వీటితోనే ముడిపడి ఉన్నాయి. మనదేశం నుండి వస్తు ఉత్పత్తుల ఎగుమతి పడిపోకుండా మోడీ సర్కార్ సరైన చర్యలు చేపట్టలేదని పై గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ రంగాల్లోని ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలు మాత్రం భారీ లాభాలు పోగేసుకున్నాయి.
భారమవుతోన్న దిగుమతుల బిల్లు
పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతే..ఎగుమతులు కూడా పడిపోతాయి. దిగుమతులు (పెట్రోల్, బంగారం, రసాయనాలు..మొదలైనవి) పెరిగిపోయి, ఎగుమతులు పడిపోతే భారత్ లాంటి దేశానికి నష్టం లక్షల కోట్లలో ఉంటుంది. ఈ ఏడాదిలో కరెంట్ ఖాతా లోటు 13.4 బిలియన్ డాలర్ల నుంచి 24 బిలియన్ డాలర్లకు (ఆగస్టునాటికి) చేరుకుంది. అయినా మోడీ సర్కార్‌కు అదేమీ పట్టడం లేదు. మనవద్ద ఉన్న డాలర్ నిల్వలు అడుగంటడం ప్రారంభించాయి. ఇదొక్కటే కాదు..ఇతర రంగాల్లోనూ వస్తు తయారీ సంక్షోభంలో చిక్కుకుంది. లోహాలు, విద్యుత్ ఉపకరణాల తయారీ, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు..ఇవన్నీ గణనీయంగా పడిపోయాయి. ఆహార ఉత్పత్తుల్లో వృద్ధి సున్నాకు చేరుకుంది.
కార్పొరేట్‌ను నమ్ముకున్న కేంద్రం
సమాజంలో ధనికుల వద్దకు సంపద చేరితే..అది కిందికి ఊటలా దిగుతుందన్న 'ట్రిగిత్ డికీ' సిద్ధాంతం తప్పని రుజువైంది. దీనిని పట్టుకొని మోడీ సర్కార్ వేలాడుతోంది. అందుకే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడటం లేదు. దాంతో పారిశ్రామిక సరుకులకు మార్కెట్ లేదు. ఇదొక విషయ వలయం. ప్రజలు చైతన్యంతో మేల్కొని నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య, తక్కువ వేతనాలు, అధిక ధరలు, కొనుగోలు శక్తి పడిపోవటం ..వంటివి తీవ్రతరం అవుతున్నాయి. ఇందుకు కారణం కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలేనని ఇప్పుడు రుజువైంది. నిరుద్యోగ సమస్య కొనసాగటం వల్ల తక్కువ వేతనాలతో మానవ వనరులు తమకు అందుబాటులోకి వస్తాయని కార్పొరేట్ రంగం భావిస్తోంది.