Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
చెన్నై : ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి ఈ మేరకు ఒక లేఖ రాశారు.''యువత హిందీ చదివితేనే కొన్ని ఉద్యోగాలకు అర్హులు అవుతారని, రిక్రూట్మెంట్ పరీక్షల్లో తప్పనిసరి పేపర్లలో ఇంగ్లీషును తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది. ఇవన్నీ మన రాజ్యాంగ సమాఖ్య సూత్రాలకు విరుద్ధం. మన రాజ్యాంగం, మన దేశ బహుభాషా స్వరూపానికి ఇది హాని కలిగిస్తుంది.'' అని ఆ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో తమిళంతో సహా 22 భాషలు ఉన్నాయని, ఈ పట్టికలో మరికొన్ని భాషలను కూడా చేర్చాలని అనేక డిమాండ్లు ఉన్నాయన్నారు.
''కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో హిందీ తప్పనిసరిగా బోధనా మాధ్యమంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్న కమిటీ సిఫారసు చేసింది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ స్థానంలో హిందీ ఉండాలి.'' అని ఆ కమిటీ సిఫారసు చేసిందని ప్రధాని మోడీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. అన్ని సాంకేతిక, సాంకేతికేతత సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలలో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలని సూచించిందన్నారు.
భారతదేశంలో హిందీ మాట్లాడే వారి కంటే ఇతర భాషలు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉందని స్టాలిన్ అన్నారు. ప్రతిభాషకు ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రధాని గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. ప్రజలపై హిందీ బలవంతంగా రుద్దేందుకు ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలు మంచివి కాదన్నారు. ఆచరణ సాధ్యం కాని ఈ ప్రయత్నాలు హిందీ మాట్లాడని ప్రజలను చాలా విషయాలలో ప్రతికూల పరిస్థితులకు నెట్టివేస్తున్నాయన్నారు. ఇది ఒక్క తమిళనాడుకే కాదు, తమ మాతభాషకు విలువిచ్చే, గౌరవించే ఏ రాష్ట్రానికీ ఆమోదయోగ్యం కాదన్నారు.భారత దేశ ఐక్యత, సామరస్యతను కాపాడాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుని, వారి భావాలను గౌరవిస్తూ, అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ హిందీయేతర భాష మాట్లాడే ప్రజలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషలలో ఒకటిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారని స్టాలిన్ లేఖలో వెల్లడించారు. అధికార భాషపై 1968, 1976లో ఆమోదించబడిన తీర్మానాలు, దాని కింద నిర్దేశించిన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఆంగ్లం, హిందీ రెండింటినీ ఉపయోగించవచ్చన్నారు.
విభిన్న భాషా సౌరభాలతోపాటు సుసంపన్నమైన, వివిధ సాంస్కతిక వైవిధ్యాలను ప్రోత్సహించడం భారత ఉపఖండానికి గర్వకారణమన్నారు. అందరినీ కలుపుకుని పోయేలా ఇప్పటి వరకు అనుసరిస్తున్న సామరస్య విధానాల కారణంగానే నేడు ప్రపంచ వేదికల్లో బహుళ సాంస్కృతిక, బహుభాషా ప్రజాస్వామ్యానికి భారతదేశ ఉపఖండం ఉజ్వల ఉదాహరణగా నిలుస్తోందన్నారు. ఒక దేశం, ఒక భాష పేరుతో హిందీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలు, వివిధ భాషలు, సంస్కతులను పాటించే ప్రజల మధ్య సుహృద్భావాన్ని నాశనం చేస్తాయని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదంతా భారతదేశ సమగ్రతకు హానికరమని భయపడుతున్నట్లు స్టాలిన్ తెలిపారు. శాస్త్ర వికాసాన్ని, సాంకేతిక సదుపాయాలను దష్టిలో ఉంచుకుని తమిళంతో సహా అన్ని భాషలను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి, అన్ని భాషలను ప్రోత్సహించి ప్రగతి దారులను తెరవాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉండాలని సూచించారు. అన్ని భాషలు మాట్లాడే వారికి సమానంగా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లొద్దని స్టాలిన్ ప్రధానిని కోరారు.