Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల జీవనోపాధి అత్యంత దయనీయం
- కార్మికరంగంలో స్త్రీశక్తికి నిరాదరణ, అసమానతలు
- 2004-05లో వారి ప్రాతినిథ్యం 43శాతం..2021నాటికి 25శాతం
: ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక
- పురుషులతో సమాన ప్రాతినిథ్యం ఉంటే..జీడీపీ 43శాతం పైకి..
న్యూఢిల్లీ : కాలం మారుతున్న కొలదీ అనేక దేశాలు ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేస్తున్నాయి. కార్మిక రంగంలోకి మహిళలు పెద్ద సంఖ్యలో ప్రవేశించటం వల్లే ఆ దేశల్లో ఆర్థిక ప్రగతి సాధ్యమైందని సామాజికవేత్తలు చెబుతున్నారు. కార్మికరంగంలో మహళల ప్రాతినిథ్యం పెంచడానికి చైనాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. వృత్తి శిక్షణ, సహకారం, రుణ సాయం..వంటివి గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. జీవనోపాధిని పెంచటంలో, పేదరికాన్ని వేగంగా తగ్గించటంలో ఈ పథకాలు చక్కగా పనిచేశాయని చైనా అనుభవాలు చెబుతున్నాయి. వస్త్ర పరిశ్రమలో మహిళా కార్మికులు, ఉద్యోగుల్ని పెంచటం ద్వారా బంగ్లాదేశ్ సైతం అనూహ్యమైన ఫలితాల్ని అందుకుంది. ల్యాండ్ ఫూలింగ్, సహకార వ్యవసాయం మహిళా సంఘాలకు అప్పగిస్తూ కేరళలో చేపట్టిన 'కుటుంబశ్రీ' పథకం మనదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మహిళల్ని తిరిగి కార్మికశక్తి వైపు తీసుకెళ్లడానికి 'కుటుంబశ్రీ' వంటి పథకాలు దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
4కోట్లమంది దూరమయ్యారు..
2020లోకి అడుగుపెట్టినా..మనదేశంలో మాత్రం మహిళలు తీవ్రమైన వివక్ష, అసమానతల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా సంక్షోభం మొదలయ్యాక భారత్‌లో దాదాపు 4కోట్లమందికిపైగా మహిళలు కార్మికరంగానికి దూరమయ్యారని 'ఆక్స్‌ఫామ్ ఇండియా' తాజా నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా విడుదల చేసే 'కార్మికరంగంలో మహిళల ప్రాతినిథ్య రేటు' గణాంకాల్ని విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించింది. 2004-05 నాటితో పోల్చితే 2021నాటికి మహిళల ప్రాతినిథ్యం ఎలా తగ్గుతూ వచ్చిందన్నది వివరించింది. దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నా..కార్మికరంగంలో వారి వాటా కేవలం 25శాతానికి పరిమితమైందని తెలిపింది. గత 20 ఏండ్లలో నెలవారీ వేతనాలు అందుకునే మహిళా ఉద్యోగుల సంఖ్యలో పెరుగుదల కేవలం 39 లక్షలు మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఈ ట్రెండ్ అత్యంత ఆందోళనకు గురిచేసే అంశమిదని 'ఆక్స్‌ఫామ్' హెచ్చరించింది.
వివక్ష..అసమానతలు
వ్యవసాయరంగంలో యాంత్రికీకరణ పెరిగాక..ఎక్కువగా ఉపాధి కోల్పోయింది మహిళలే. గ్రాడ్యుయేషన్ పూర్తయిన మహిళలకు పెద్దగా ఉద్యోగాలు రావటం లేదు. మొత్తం మహిళా కార్మికుల్లో 70శాతానికిపైగా దినసరి కూలీలుగానూ, తక్కువ వేతనాలు దక్కే ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చాక మహిళల పరిస్థితి మరింత దెబ్బతిన్నది. దాదాపు 5.6కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి వెళ్లిపోయారని ఒక అంచనా. పురుషులతో పోల్చితే మహిళల ప్రాతినిథ్యం సమానంగా ఉండి ఉంటే..గత రెండు దశాబ్దాల్లో (2004-2021) భారత జీడీపీ 43శాతం పెరిగి వుండేది. అంతర్జాతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూసినా భారత్ పరిస్థితి అట్టడుగున ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్-2022 సూచికలో భారత్ ర్యాంక్ 135కు చేరుకుంది. మొత్తం 146దేశాలకు ర్యాంకులు కేటాయించగా, భారత్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల్లో అన్ని వయస్సుల వారూ ఉపాధి దూరమవుతున్నారనేది సూచిక చెబుతోంది. దాంతో వారంతా తీవ్రమైన పేదరికంలో కూరుకుపోతున్నారని నివేదిక తెలిపింది. వివక్ష, అసమానతల వల్ల 15-24ఏండ్ల మధ్య మహిళలు కార్మికరంగానికి దూరమవుతున్నారు.
అనేక మార్గాలున్నాయి..అయినా..
ఉపాధిరంగంలో మహిళల సంఖ్య పెంచడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు జేస్తున్నాయి. మహిళల్ని స్వయం ఉపాధి వైపు తీసుకెళ్లేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్..వంటివి ఉన్నాయి. మహిళల ఆదాయం, ఉత్పాదక పెంచటంలో కీలకంగా ఉన్న మరో పథకం 'ఉపాధి హామీ'. కుటుంబ ఆదాయాన్ని పెంచటంలో, మహిళలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించటంలో ఈ పథకాలు కొంతవరకు దోహదపడ్డాయి. వివక్ష, అసమానతల్ని రూపుమాపకుండా, కేవలం పథకాలతో అంతా మార్పు వస్తుందని భావించడానికి వీల్లేదని నివేదికలో పరిశోధకులు చెప్పారు.
మనదేశంలో ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో మహిళలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉపాధి, వేతనాలు పొందటంలో తీవ్ర వివక్షకు గురవుతున్నారు. పని ప్రదేశాల్లో వివక్ష కారణంగా వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావటం లేదు. నెలవారీగా స్థిరమైన వేతనాలు అందుకోవటంలో, స్వయం ఉపాధిలో, చివరికి..క్యాజువల్ లేబర్‌లోనూ మహిళ వివక్షకు గురవుతోంది. నేటి పాలకులు సరైన చర్యలు చేపట్టకపోవటం వల్ల కార్మికరంగంలో మహిళల సంఖ్య (ప్రాతినిథ్యం) క్రమక్రమంగా పడిపోతోంది. మహిళా ప్రాతినిథ్యం 2004-05లో 43శాతముంటే, 2021నాటికి 25శాతానికి పడిపోయింది.
- ఆక్స్‌ఫామ్ ఇండియా