Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 182 సీట్లలో 25 స్థానాలను నిర్ణయించేది వారే
- బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చీలనున్న ఓట్లు
- ఇది దళిత సామాజికవర్గానికి లాభం చేకూర్చదు
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ విశ్లేషకులు
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనప్పటికీ ఆ వేడి రాష్ట్రంలో ఇప్పటికే మొదలైంది. ప్రతిసారి గుజరాత్లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉండే పోటీ ఆప్ రాకతో త్రిముఖ పోరుగా మారనున్నది. సుదీర్ఘకాలం బీజేపీ అధికారంలో ఉండటం, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావటం, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. వెరసి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. పలు సీట్లలో అభ్యర్థుల భవితవ్యాన్ని వారు నిర్ణయించ నున్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 25 అసెంబ్లీ స్థానాల్లో దళిత ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈ 25 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించేది దళిత ఓటర్లేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ 25 సీట్లలో 13 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 12 సీట్లలో దళితుల ఓట్లు పదిశాతం కంటే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలను, కాంగ్రెస్ ఏడు సీట్లను గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థిగా జిగేశ్ మేవానీ ఒక స్థానంలో (వాద్గమ్ నియోజకవర్గం) విజయం సాధించారు.
గుజరాత్ జనాభాలో దళితులు ఎనిమిది శాతం
గుజరాత్ జనాభాలో దళితుల సంఖ్య ఎనిమిది శాతం. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చీలిపోనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. దళితుల ఓట్లను పొందే విషయంలో రాజకీయ పార్టీల నాయకులు ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1995 నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ 13 స్థానాల్లో బీజేపీ అధిక స్థానాలను గెలుస్తున్నది. 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 11, 10 సీట్లను గెలుచుకున్నది. కాంగ్రెస్ వరుసగా రెండు, మూడు సీట్లలో విజయం సాధించింది. 2017లో బీజేపీ స్థానాలు ఏడుకు తగ్గాయి. కాంగ్రెస్ బలం పుంజుకొని తన స్థానాలను మూడు నుంచి ఐదుకు పెంచుకున్నది. అలాగే, కాంగ్రెస్ మద్దతుతో వాద్గం స్థానం నుంచి మేవానీ విజయం సాధించారు. గధడ నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 2020లో రాజీనామా చేసి, 2022లో బీజేపీలో చేరారు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు ఆత్మారామ్ పర్మార్ విజయం సాధించారు. ఈ రాజకీయ చదరంగంలో గుజరాత్‌లోని దళితులు అయోమయంలో ఉన్న సమాజ మని సామాజికవేత్త, గుజరాత్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గౌరంగ్ జానీ అన్నారు. ''వారు సంఖ్యాపరంగా ఇతర సామాజిక వర్గాలలాగా పెద్దగా లేరు. పైగా వంకార్, రోహిత్, వాల్మీకి అనే మూడు ఉపకులాలుగా విభజించ బడ్డారు. ఇందులో అత్యధికంగా ఉండే వంకార్లను ఆకర్షిం చటానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఇక పారిశుధ్య కార్మికులు గా ఉండే వాల్మీకీలు విభజించబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో మూడు పార్టీలు బరిలో నిలవటంతో దళితులు ఓట్లు చీలుతాయి. ఇది వారి రాజకీయ ప్రాముఖ్యత తగ్గటా నికి దారి తీస్తుంది. ముఖ్యంగా, దళిత సామాజిక వర్గానికి ఒక బలమైన నాయకుడు లేకపోవటం ఒక ప్రతికూల అంశం. ఈ విధంగా దళితుల ఓట్లు చీలిపోవటం ఏ రాజ కీయపార్టీకి గానీ, దళిత సామాజిక వర్గానికి గానీ ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చదు. దాదాపు 27 ఏండ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ దళిత సామాజిక వర్గంపై అంతగా పట్టుసాధించ లేకపోయింది. దళితలకు సంబంధించిన అంశాలనూ లేవ నెత్తలేకపోయింది. మరోకవైపు, పార్టీ నుంచి దళిత నాయ కులు బీజేపీకి ఫిరాయిస్తూ వచ్చారు. కాంగ్రెస్ అనుసరించిన ఖామ్ (క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం) వ్యూహం ఫలించలేదు'' అని ఆయన చెప్పారు.
'దళితులు సాధారణంగా గ్రామాల్లో మైనారిటీలుగా ఉంటారు. ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ వారి సంఖ్య పెద్దగా ఉండదు. మహాత్మా గాంధీ పేరును కాకుండా బాబాసాహేబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పేర్కొంటూ దళితులను దగ్గర చేసుకోవటానికి ఆప్ కొత్త వ్యూహానికి పదును పెట్టింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులకు సంబంధించి ఇప్పటికే పలు హామీలను గుప్పించింది. రిజర్వ్కానీ సీట్లలో పదిశాతంకంటే ఎక్కువ దళిత ఓట్లు ఉన్న స్థానాలలో దళిత ఓటు శాతాన్ని పెంచుకోవటంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది' అని గౌరంగ్ జానీ చెప్పారు. గుజరాత్లో అధికారమే లక్ష్యంగా దళితుల ఓట్లను రాబట్టుకోవటానికి ఆప్ ఇప్పటికే అనేక హామీలను గుప్పించింది. నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు, నిరుద్యోగభృతి, మహిళలకు రూ.1000 భత్యం వంటివి ఇందులో ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ కూడా తన ప్రయత్నా లకు మరింత పదును పెడుతున్నది. అన్‌రిజర్వ్ స్థానాల్లోనూ దళితులను నిలబెట్టిందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 2022లో తానూ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనున్నట్టు ఆయన చెప్పారు.సుదీర్ఘకాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎలాగైనా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని విశ్లేషకులు చెప్పారు. మోడీ సొంత రాష్ట్రం కావటంతో.. దేశవ్యాప్తంగా ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై పెరిగిన దాడులు, వాటిని అరికట్టటంలో స్థానిక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన తీరు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతాయని వారు అన్నారు. ఈ సారి బీజేపీ వచ్చే దళిత ఓట్ల సంఖ్య కచ్చితంగా తగ్గుతుందని అంచనా వేశారు.