Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 96 శాతం పోలింగ్..రేపు ఫలితాలు
- కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఖర్గే,శశిథరూర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా 96 శాతం పోలింగ్ జరిగింది. రేపు (బుధవారం) ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి ఉంటుంది. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, ఆనంద్ శర్మ, చిదంబరంతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జీలు మొత్తం 87 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో యాత్రలో ఉన్న49 మంది ఓటర్లు బళ్లారిలోని యాత్ర సైట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున్ ఖర్గే కర్నాటకలోని బెంగళూర్లో, శశిథరూర్ కేరళలోని తిరువనంతపురంలో ఓటు వేశారు.9,915 మంది ఓటర్లకు గానూ 9,500 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మెన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఓటింగ్ పూర్తి అయిన అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, పార్టీ రాజ్యాంగానికనుగుణంగా జరిగాయని తెలిపారు. చిన్న రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్ జరిగిందని, పెద్ద రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని అన్నారు. 36 పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. ఏఐసీసీ కార్యాలయంలో అన్ని బ్యాలెట్ బాక్సుల్లోని ఓటింగ్ స్లిప్స్ ను కలిపి ఓట్లను లెక్కిస్తామని, రహస్య బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరిగిందని, కాబట్టి ఏ రాష్ట్రం నుంచి ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చయే చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్లంతా మద్దతు తెలపడంతో మల్లికార్జన్ ఖర్గే గెలుపు దాదాపు ఖాయం అయిపోనట్లేనని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.