Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగ్‌పూర్ పంచాయతీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ
- ఆరెస్సెస్, గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి ఇలాఖాలో కాంగ్రెస్ సత్తా
- తొమ్మిది చైర్పర్సన్, ఎనిమిది డిప్యూటీ చైర్పర్సన్ పదవులు కైవసం
ముంబయి : మహారాష్ట్రలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయపార్టీకి చేదు ఫలితాలే ఎదురయ్యాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్ సత్తా చాటింది. అధిక స్థానాలను కైవసం చేసుకున్నది. బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ ప్రధాన కేంద్రం, సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బువాంకులే ల సొంత జిల్లా నాగ్‌పూర్‌లోనే ఇలాంటి ఫలితాలు రావటం బీజేపీకి మింగుడుపడని విషయమని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.
ఒక్క చైర్పర్సన్ పదవినీ పొందని బీజేపీ
నాగ్‌పూర్ జిల్లాలో పంచాయతీ చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం.. బీజేపీ ఒక్క చైర్పర్సన్ పదవినీ పొందలేకపోయింది. కేవలం మూడు డిప్యూటీ చైర్పర్సన్ సీట్లకే పరిమితమైంది.
మొత్తం 13 చైర్పర్సన్ పోస్టులకు గానూ హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 13 డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు గానూ ఎనిమిదింటిలో జయకేతనం ఎగురవేసింది. ఇక నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మూడు చైర్పర్సన్ పదవులను గెలుపొందింది. శివసేన ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ గెలుపొందినవాటిలో సావోనేర్, కల్మేశ్వర్, పార్సియోని, మౌడా, కాంప్టీ, ఉమ్రేడ్, భివాపూర్, కుహి, నాగ్‌పూర్ రూరల్ లు ఉన్నాయి. కటోల్, నార్ఖేడ్, హింగ్నా స్థానాలను ఎన్సీపీ గెలుచుకున్నది. రామ్‌టెక్ చైర్పర్సన్ పదవిని శివసేన గెలుచుకున్నది. రామ్టెఖ్ సీటును ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని 'బాలాసాహేబంచి శివ సేన' సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆరెస్సెస్, సీనియర్ నాయకులు నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రశేఖర్ బవాన్కులే ల సొంత జిల్లాలో పార్టీ ఓటమిని ఎదుర్కొన్నందున పంచాయతీ ఫలితాలు బీజేపీ క్యాడర్‌ను నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ రూరల్ యూనిట్ చీఫ్ రాజేంద్ర ములక్ అన్నారు. గెలుపోటములు జరుగుతుంటాయి, కానీ, వారు ఓడిపోయిన తీరు చూస్తే జిల్లాలో బీజేపీ క్యాడర్‌కు పట్టు లేదన్న విషయం తెలుస్తున్నదని ఆయన చెప్పారు.