Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- నవంబర్ 9న ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను తదుపరి సీజేఐగా నియమించారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. 2024 నవంబర్ 10 వరకు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. డివై చంద్రచూడ్ ముంబయిలో కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివారు. తరువాత ఢిల్లీలో సెయింట్ కొలంబస్ స్కూల్లో చదివారు. 1979లో ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ (ఢిల్లీ)లో ఎకనమి క్స్, మ్యాథమెటిక్స్‌లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీలోని లా సెంటర్ క్యాం పస్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీని పొందారు. 1986లో హార్వర్డ్‌లో ఆయన డాక్టరేట్ ఆఫ్ జురిడి కల్ సైన్స్ (ఎస్జెడి) పూర్తి చేశారు. మొదట సుల్లివన్ అండ్ క్రోమ్‌వెల్ అనే న్యాయ సంస్థలో చంద్ర చూడ్ పని చేశారు. ఆ తరువాత ముంబాయి హై కోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1998 జూన్‌లో ముంబాయి హైకోర్టు సీనియర్ న్యాయవాది అయ్యారు. అదే ఏడాదిలో అడిషనల్ సొలిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. న్యాయ మూర్తిగా నియామకం అయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2000 మార్చి 29న ముంబా యి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే మహారాష్ట్ర జ్యూడీషియల్ అకాడమీకి డైరెక్టర్‌గా పని చేశారు. 2013 అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్ 24న సుప్రీం కోర్టు కొలీజియం సభ్యుడ య్యారు. రాజ్యాంగ చట్టం, మానవ హక్కులు, లింగ న్యాయం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వాణిజ్య చట్టం, క్రిమినల్ చట్టాలపై తీర్పులిచ్చారు. లైంగిక స్వయం ప్రతిపత్తి, గోప్యత, పర్యావరణం, రాజకీయ పరమైన అంశాలపై తీర్పులు ఇచ్చారు. శబరిమల, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, కార్మికుల శ్రమ, వికలాంగుల హక్కులు, బీమా చట్టం, ఆధార్, నిఘా, మనీబిల్లు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు మహిళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘిస్తాయంటూ తీర్పులు ఇచ్చారు.