Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్కిస్ బానో లైంగికదాడి దోషుల విడుదల
- ఎస్పీ, సీబీఐ, సీబీఐ కోర్టు న్యాయమూర్తి వ్యతిరేకత : సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
- పిటిషన్ దార్లందరికీ అఫిడవిట్ అందజేయండి: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం
- నవంబర్ 29కి కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని బిల్కిస్ బానో లైంగికదాడి కేసులో 11 మంది దోషులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందనీ, ఆ తరువాతే సత్ప్రవర్తనపై ఖైదీలను విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. అలాగే దోషుల విడుదలను సీబీఐ, సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, ఎస్పీ, ముంబయి సెషన్స్ కోర్టు వ్యతిరేకించాయని తెలిపింది. బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మలు దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 25న, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై సెప్టెంబర్ 9న గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో గుజరాత్ ప్రభుత్వం 500 పేజీలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసింది. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ వేడుకల్లో భాగంగా ఖైదీలకు ఉపశమనం మంజూరు కోసం సర్క్యులర్ గవర్నింగ్ గ్రాంట్ కింద కాకుండా, 1992 జులై 9 నాటి అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన విధానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఉపశమనం కల్పించేందుకు ఏడుగురు అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఖైదీలను ముందస్తుగా విడుదల చేయాలనే ప్రతిపాదనను ఎస్పీ, సీబీఐ, ఎస్సీబీ (ముంబయి), ప్రత్యేక న్యాయమూర్తి (సీబీఐ), సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (గ్రేటర్ ముంబాయి) వ్యతిరేకించాయనీ, అయితే గుజరాత్‌లోని అధికారులందరూ 10 మంది దోషుల విడుదలకు తమ అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. అయితే ఖైదీ రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా అలియాస్ లాలా వకీల్‌ను ముందస్తుగా విడుదల చేయడాన్ని దాహౌద్ జిల్లా ఎస్పీ, దాహౌద్ జిల్లా కలెక్టర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారనీ, అహ్మదాబాద్‌లోని అడిషనల్ డీజీపీ కూడా అతనిని విడుదల చేయాలని సిఫారసు చేయలేదని తెలిపింది.
''2021 ఫిబ్రవరి 23న బిల్కిస్ బానో కేసులు దోషులను విడుదల చేసేందుకు అప్లికేషన్ విడుదల చేశాం. 2021 మార్చి 11న జిల్లా ఎస్పీ, సీబీఐ, ఎస్సీబీలు, 2021 మార్చి 22న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి, సిటీ సివిల్ సెషన్స్ కోర్టు (గ్రేటర్ ముంబయి) దోషుల విడుదలను వ్యతిరేకించాయి. 2022 మార్చి 7న దాహౌద్ జిల్లా ఎస్పీ, కలెక్టర్లు దోషుల విడుదలకు అభ్యంతరం చెప్పలేదు. గోద్రా సబ్ జైల్ సూపరింటెండెంట్ కూడా దోషుల విడుదల చేయడానికి ఆమోదించారు. 2022 మే 26న జైల్ సలహా కమిటీ దోషుల విడుదలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, 2022 జూన్ 9న గుజరాత్ అడిషనల్ డీజీపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దోషుల విడుదలపై అభిప్రాయాన్ని తెలియజేయాలని 2022 జూన్ 28న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖకు గుజరాత్ హౌం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దానికి స్పందించిన హౌం మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలుపుతూ 2022 జులై 11న గుజరాత్ హౌం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తరువాతనే 2022 ఆగస్టు 10న 11 మంది దోషులను విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశాం. అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, 11 మంది ఖైదీలు జైలుల్లో 14 ఏండ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు. వారి ప్రవర్తన బాగుందని గుర్తించాం. అందుకే వారిని విడుదల చేయాలని నిర్ణయించాం'' అని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్ నిర్వహించదగినది కాదని, వాస్తవాలపై సమర్థించదగినది కాదని తెలిపింది. ఉపశమన ఉత్తర్వులను సవాల్ చేయడానికి పిటిషనర్లకు ఎటువంటి హక్కు లేదని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, దోషులు, ప్రాణాలతో బయటపడిన వారి మధ్య ఉన్న విషయంలో మూడో పార్టీ (వ్యక్తి) పిటిషన్లు దాఖలు చేయలేవని పేర్కొంది. కేవలం రాజకీయ కుతంత్రాల్లో భాగంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించింది.
అన్ని పక్షాలకు అఫిడవిట్‌ను అందించండ్ణి సుప్రీం కోర్టు
బిల్కిస్ బానో సామూహిక లైంగికదాడి కేసులో పదకొండు మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పందన (అఫిడవిట్) చాలా భారీ (పెద్దది)గా ఉందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాలకు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌ను అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 29న చేపడతామని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని సీపీఐ(ఎం) ఖండించింది. ఇదేనా భేటీ బచావో? దీని గురించేనా గురించి బీజేపీ మాట్లాడుతోంది? అని ప్రశ్నించింది.