Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో పర్యావరణ, దళిత కార్యకర్తలు కలవాలి..
- 2024లో బీజేపీకి ప్రత్యామ్నాయం : ఏచూరి
కొల్కతా : 'హిందూత్వ' ప్రచారకులను ఓడించేందుకు లౌకిక ప్రాంతీయ పార్టీలతోపాటు, పర్యావరణ, దళిత, వాతావరణ మార్పుల కార్యకర్తలు ఏకతాటిపైకి రావాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పర్యావరణం,, దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు సెక్యులర్ పార్టీల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యకర్తలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలోపేతం చేయాలని కోరారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో బీజేపీని ఓడించేందుకు కృషి చేయాలని, ఆ తర్వాత జాతీయ ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని వారికి సూచించారు. 1996, 2004లో బీజేపీ అధికారంలో రాకుండా ఎలాగైతే ప్రత్యామ్నాయం ఏర్పడిందో, 2024లోనూ అదే జరుగుతుందన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏచూరి పై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..దళిత ఉద్యమాలు, పర్యావరణం, వాతావరణం వంటి వివిధ సమస్యలపై ప్రజా ఉద్యమాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉందని ఏచూరి అభిప్రాయపడ్డారు. తద్వారా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలోపేతం చేయాలని ఆయన అన్నారు. మతతత్వాన్ని ఓడించేందుకు ఈ ఉద్యమాలకు అతీతంగా లౌకిక పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. హిందూత్వ ప్రచారకులను ఓడించేందుకు ఈ విశాల వేదిక బలోపేతం కావాలన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నాయని, వాటిని ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు.
బెంగాల్లో టీఎంసీ అడ్డుగా మారింది..
బీజేపీకి ప్రత్యామ్నాయం సృష్టించాలంటే మొదట రాష్ట్ర స్థాయిలో జరగాలి. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో లౌకిక శక్తులకు భారీ అవకాశాలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలతో బీజేపీకి ప్రత్యామ్నాయం సాధిస్తాం. 1996లో యునైటెడ్ ఫ్రంట్, 2004లో యూపీఏ ఏర్పాటు చేసినట్టుగానే, 2024లోనూ బీజేపీని అడ్డుకుంటాం. మత విద్వేష భావజాలాన్ని వామపక్షాలు, కమ్యూనిస్టు కార్యకర్తలు బలంగా అడ్డుకోవాలి. అయితే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పెద్ద అడ్డంకిగా మారింది. ఈ రాష్ట్రంలో బీజేపీ పట్టుసాధించడానికి టీఎంసీ అవకాశం కల్పించింది.
ప్రజాస్వామ్యంపై దాడి..
విమానాశ్రయాల దగ్గర్నుంచి ఓడరేవుల వరకు అన్నీ ప్రయివేటుపరం అవుతున్నాయి. గత 8ఏండ్లలో భారతదేశ స్థానం దిగజారని ప్రపంచ సూచిక లేదు. దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేనివిధంగా ఉంది. తన రాజకీయ ఆశయాల కోసం మోడీ సర్కార్ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగిస్తోంది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. దేశాన్ని నిఘా వ్యవస్థగా మార్చేశారు.