Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 59 పంచాయతీ స్థానాల్లో విజయం.. నాసిక్‌లో అతి పెద్ద పార్టీగా సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఘన విజయం సాధించింది. నాసిక్, పాల్ఘర్-థానే, అహ్మద్‌నగర్‌లో వివిధ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. నాసిక్ జిల్లాలో మొత్తం 59, పాల్ఘర్-థానే జిల్లాలో 26, అహ్మద్‌నగర్ జిల్లాలో 6 గ్రామ పంచాయితీలను మొత్తం 91 గ్రామ పంచాయితీలను సీపీఐ(ఎం) గెలుచుకున్నది. మహారాష్ట్రలోని 18 జిల్లాల్లోని 1,165 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు వంద గ్రామపంచాయతీల్లో సీపీఐ(ఎం) పాలన కైవసం చేసుకుంది. నాసిక్ జిల్లాలో సుర్గానా మండలంలో 33, కల్వాన్‌లో 8, త్రయంబకేశ్వర్‌లో 7, దిండోరిలో 6, పేత్‌లో 5 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో అన్ని పార్టీల కంటే సీపీఐ(ఎం) ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంది. పాల్ఘర్-థానే జిల్లాలో దహను మండలంలో 9, జవహర్‌లో 5, తలసరిలో 4, విక్రమ్గడ్లో 3, వాడలో 3, షాహాపూర్, ముర్బాద్ల్లో చెరొక్క స్థానాలను సీపీఐ(ఎం) సొంతం చేసుకున్నది. అహ్మద్‌నగర్ జిల్లాలో అకోలా మండలంలో ఆరు గ్రామ పంచాయితీలను దక్కించుకున్నది. అతిపెద్ద ఏకైక పార్టీగా ఉన్న అనేక పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ కూడా సర్పంచ్ పదవులను సొంతం చేసుకొనే అవకాశం ఉన్నది. నాసిక్ జిల్లాలో 194 పంచాయతీలకు గాను 59 పంచాయతీలను గెలుచుకుని సీపీఐ(ఎం) అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాసిక్‌లో ఎన్సీపీ 51 పంచాయతీల్లో గెలుపొందగా, కాంగ్రెస్ తొమ్మిది పంచాయతీలకు పరిమితమైంది. బీజేపీకి 13 పంచాయతీలు వచ్చాయి. మొత్తం 1,165 స్థానాల్లో బీజేపీకి 239 గ్రామ పంచాయతీల్లో, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన 113 పంచాయతీల్లో విజయం సాధించాయి. మహా వికాస్ కూటమి పార్టీలలో ఎన్సీపీ155 పంచాయతీల్లో, శివసేన ఉద్ధవ్ 153 పంచాయతీల్లో, కాంగ్రెస్ 149 పంచాయతీల్లో విజయం సాధించాయి.