Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం విజయన్
త్రివేండ్రం : దేశం సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే అవినీతి రహిత పాలనా వ్యవస్థ చాలా అవసరమని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఈ దృక్పథంతోనే కేరళలో వామపక్ష ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. మంగళవారం రాష్ట్ర విజులెన్స్ అండ్ యాంటి కరప్షన్ బ్యూరో ప్రారంభించిన 'అవినీతి రహిత కేరళ' ప్రచారంపై సీఎం విజయన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల అవినీతి ముప్పు చాలా వరకు అరికట్టాం. దేశంలో అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. ఒకప్పుడు రాష్ట్రంలో అవినీతి ఒక తీవ్ర సమస్యగా విస్తరించి ఉంది. దీనిని మా ప్రభుత్వం చాలా వరకు అరికట్టిందని నమ్మకంగా చెప్పగలను. భవిష్యత్తులో అవినీతిని పూర్తిగా నిర్మూలించగలం. ఇందుకోసం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా''మని విజయన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, ఉద్యోగ బదిలీల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేశామని, ఇది ప్రశంసనీయ విజయమనీ అన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలుజేయడం, దృఢమైన చర్యలు తీసుకోవడం, దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం ద్వారానే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని విజయన్ అన్నారు. నేటి పిల్లలే రేపటి యువకులు, పెద్దలు అవుతారని, అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు పోరాడాలని సీఎం విజయన్ పిలుపునిచ్చారు.