Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్, వ్యాపార సంస్థలతో
- గుజరాత్ ఎన్నికల సంఘం ఒప్పందం
న్యూఢిల్లీ : పోలింగ్ రోజు..సెలవుపెట్టి..ఓటు వేయని ఉద్యోగుల, కార్మికుల పేర్లను నోటీస్బోర్డ్లో పెట్టాలని కార్పొరేట్, ప్రయివేటు సంస్థతో గుజరాత్ ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకుంది. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కార్పొరేట్ కార్యాలయాలు, పారిశ్రామిక యూనిట్లలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి గుజరాత్ ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం ప్రారంభించింది. మొదటిసారిగా ఆ రాష్ట్రంలోని వెయ్యికిపైగా కార్పొరేట్ సంస్థలతో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈనేపథ్యంలో పోలింగ్ రోజు సెలవుపెట్టి ఓటు వేయని ఉద్యోగుల, కార్మికుల వివరాల్ని సేకరించబోతోంది. 100 లేదా అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తున్న పరిశ్రమలలో నోడల్ అధికారిని నియమిస్తోంది. పోలింగ్ రోజు ఓటు వేయని వారి వివరాల్ని సేకరించి, ఆ పేర్లను కంపెనీ తన వెబ్సైట్లో, నోటీస్బోర్డ్లో ప్రదర్శించేలా చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ ఒప్పందం కారణంగా, ఇకపై రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు ఓటు హక్కును వినియోగించారా? లేదా? అన్నది ఈసీ పరిశీలించనుంది. దీనిపై గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారి పి.భారతీ మాట్లాడుతూ..''దాదాపు 233 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఈసీ మార్గదర్శకాల ప్రకారం దీనిని చేపట్టాం. కార్పొరేట్, ప్రయివేటులో ఓటు వినియోగం ఎలా ఉందన్నది పరిశీలించడానికి ఆయా సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించబోతున్నాం. గుజరాత్లో ఇది మొదటిసారి. దాదాపు వెయ్యికిపైగా పారిశ్రామిక యూనిట్లలోని కార్మికుల ఓటు వినియోగంపై దృష్టిపెట్టాం. పోలింగ్ రోజు ఓటింగ్ శాతాన్ని పెంచడమే ఒప్పందం లక్ష్య''మని చెప్పారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాల్ని సైతం ఈసీ సేకరిస్తోందని తెలిపారు. ఇందుకోసం నోడల్ అధికారుల్ని సైతం నియమించామని ఈసీ వెల్లడించింది.