Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూసేకరణ కోసం ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యమే కారణమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం జాప్యం చేస్తున్న కారణంగానే కీలకమైన రైల్వే ప్రాజెక్టులు ఇంకా పూర్తికావడం లేదన్నారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జి. కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రైల్వే ఉన్నతాధికారులను కూడా పిలిపించిన కేంద్ర మంత్రి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి కిషన్ రెడ్డికి వివరించారు. ఎంఎంటీఎస్ రెండో విడత ప్రాజెక్టులో కేంద్రం తన వాటా మొత్తాన్ని అందజేసిందనీ, అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా ప్రకారం రూ.545 కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు రూ. 180 కోట్లు మాత్రమే అందజేసిన విషయాన్ని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎన్నిసార్లు లేఖలు రాసినా, రైల్వే బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసినా కేసీఆర్ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యమని ఆయన అన్నారు.