Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్పోల్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై పోరాటానికి ప్రపంచ సహకారం మరింత వృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ నాలుగు రోజులపాటు జరిగే 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ ఉగ్రవాదం, అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వేటాడ్డం, వ్యవస్థీకృత నేరాలను ఓడించడానికి ప్రపంచ సహకారం మెరుగుపడాలనీ, ఇలాంటి నేరస్థులకు ఎక్కడా ఆశ్రయం లభించకూడదని అన్నారు. 'ఇలాంటి ముప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, ప్రతిస్పందన కేవలం స్థానికంగా ఉండకూడదు. ఇలాంటి ముప్పులను ఓడించేందుకు ప్రపంచం ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది' అని మోడీ చెప్పారు. స్థానిక సంక్షేమం కోసం ప్రపంచ సహకారం అన్నదే మా విజ్ఞప్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత దేశ పోలీసులపై మోడీ ప్రశంసలు కురిపించారు. దాదాపు 900 జాతీయ చట్టాలు, పదివేల రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి సమాఖ్య, రాష్ట్ర స్థాయి పోలీసులు కలిసి పనిచేస్తుంటారని చెప్పారు. 'రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల వైవిధ్యం, హక్కులను గౌరవిస్తూ భారత పోలీసు బలగాలు పనిచేస్తున్నాయి. వారు కేవలం ప్రజలను మాత్రమే రక్షించరు. మన ప్రజాస్వామ్యానికి కూడా సేవ చేస్తారు. న్యాయం, నిస్పాక్షికంగా భారీ ఎత్తున జరిగే భారత ఎన్నికలనే తీసుకోండి. సుమారు 90 కోట్ల మంది ఓటర్లు కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తారు' అని మోడీ చెప్పారు.