Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమూర్తులు కేసుల కంటే నియామకాలకే ఎక్కువ సమయం
- న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పని : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ : కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ ధర్మాసనాల్లోని న్యాయ మూర్తులు కేసుల విచారణ, తీర్పుల కంటే న్యాయమూర్తుల నియామకాల నిర్ణయానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పట్ల దేశ ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం న్యాయమూర్తులను నియమించడం కేంద్ర ప్రభుత్వ పని అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్) ప్రచురించే పాంచజన్య అనే వారపత్రిక నిర్వహించిన సబర్మతి సంవాద్ అనే కార్యక్రమంలో న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. 'ప్రపంచంలో ఎక్కడా ఒక న్యాయమూర్తి మరో న్యాయమూర్తిని నియమించుకోరు. కేసుల నిర్ణయం కంటే నియామకాలపై న్యాయమూర్తులు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల ప్రజలకు న్యాయం అందించడమనే వారి ప్రాథమిక విధి ప్రభావితమవుతోంది. న్యాయమూర్తుల నియామకం కోసం సంప్రదింపుల ప్రక్రియ చాలా తీవ్రంగా ఉంది. లోపల జరుగుతున్న రాజకీయాలు ప్రజలకు కనిపించవు. న్యాయమూర్తులను నియమించే సమయంలో న్యాయ వ్యవస్థ... ప్రక్రియ పారదర్శకంగా లేదు. కొలీజియం వ్యవస్థపై పునరాలోచిం చాల్సిన అవసరం ఉంది' అన్నారు. 1993 వరకు ప్రతి న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం నియమించేదనీ, 1998లో రాజ్యాంగలోని ఆర్టికల్ 124 (2) ప్రకారం కొలీజియం వ్యవస్థ వచ్చిందని తెలిపారు. న్యాయమూర్తులను నియమించడంలో వారు విమర్శలకు అతీతంగా ఉండలేరని అన్నారు.
విచారణ సమయంలో న్యాయమూర్తులు చేసే మౌఖిక పరిశీలనలను నియంత్రించడానికి న్యాయవ్యవస్థ అంతర్గత యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. గత ఎనిమిదేండ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో న్యాయవ్యవస్థకు హాని కలిగించే ఎలాంటి చర్యలూ తీసుకోలేదనీ, దాని అధికారాన్ని ఏ విధంగా సవాలు చేయలేదనీ, అణగదొక్కలేదని అన్నారు. 'కానీ మనం ఏదైనా సరిదిద్దాలంటే, ఆ దిద్దుబాటుకు దేశం మనోభావాలు జత చేయాలి. ఎందుకంటే ఒక దేశానికి దాని ప్రజల మద్దతు అవసరం. మేం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ని ప్రవేశపెట్టినప్పుడు, దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసి ఆపారు. కానీ మేము చేయలేదు' అని ఆయన అన్నారు.