Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రూపాయి క్షీణతపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన హాస్యాస్పందగా మారింది. రూపాయి క్షీణించడం లేదనీ, డాలర్ బలపడుతోందంటూ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలపై పలువురు హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం క్షీణించడం లేదు.. కానీ ఇతర దేశాల ర్యాంకులు ఎగబాకుతున్నా యంటూ ఓ రీడర్ పేర్కొన్నారు. వాస్తవానికి ఉల్లిపాయల ధర పెరగడం లేదనీ, కానీ అదే ధరకు తక్కువ ఉల్లిపాయలు పొందుతున్నామంటూ మరో రీడర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా 2013లో రూపాయి క్షీణతపై మోడీ స్పందించిన తీరును కొందరు హైలెట్ చేస్తున్నారు. 'యూపీఏ ప్రతిష్ట దిగజారినట్టు రూపాయి క్షీణిస్తోందని' ఎన్డీయే అధికారం చేపట్టక ముందు మోడీ పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు రాయి ప్రతిపక్షం చేతికి వచ్చింది. దీంతో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల నుంచి భారత్ తన కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి తన విదేశీ కరెన్సీ నిల్వల నుంచి ఎక్కువ మొత్తంలో డాలర్లను విక్రయించింది. దీంతో విదేశీ కరెన్సీ నిల్వలు గత ఏడాది 100 బిలియన్ డాలర్లు తగ్గి... ప్రస్తుతం 540 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ విదేశీ కరెన్సీ నిల్వలు 600 బిలియన్ డాలర్లకు తగ్గకుండా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు జాతీయ మీడియా ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. ఇప్పుడు కరెన్సీ మార్కెట్లను స్థిరీకరించడానికి కేంద్రం మరో 100 బిలయన్ డాలర్లు వెచ్చించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంటే వచ్చే ఆరునెలల్లో విదేశీ కరెన్సీ నిల్వలు 440 బిలియన్ డాలర్లకు పడిపోయి అవకాశాలు ఉన్నాయి. దీంతో మార్చి చివరి నాటికి విదేశీ కరెన్సీ నిల్వలు ఏడెనిమిది నెలల దిగువకు చేరతాయి.
అదే సమయంలో రూపాయిపై ఒత్తిడి పెరుగుతుందనీ.. ఆర్బీఐ అస్థిరతను మాత్రమే అడ్డుకోగలదు కానీ ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పాటు రూపాయి క్షీణతను నిరోధించలేదని వారు పేర్కొంటున్నారు. అంటే ఆర్బీఐ అస్థిరతను మాత్రమే అడ్డుకోగలదనీ, కానీ రూపాయి మారకపు విలువకు నిర్థిష్ట స్థాయిని నిర్ణయించేందుకు అవకాశం లేదని అర్థం.
మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం రేటును ప్రస్తుతం 7 శాతం నుంచి 2 శాతానికి తగ్గించేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే ప్రక్రియ కావడంతో ఇది అబివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ కరెన్సీల విలువలను, వాటి ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.