Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న మూడో దళిత నేత
- మొత్తం పోలైన ఓట్లు 9,385
- ఖర్గేకి పడ్డ ఓట్లు 7,897 .. శశిథరూర్‌కి ఓట్లు 1,072
- ఖర్గేకి వచ్చిన మెజార్టీ 6,825.. చెల్లని ఓట్లు 416
- ఆయన గెలుపు కాంగ్రెస్ గెలుపు: శశిథరూర్
- దేశంలో గడ్డుపరిస్థితి : మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 9,385 ఓట్లు పోలైయ్యాయి. శశిథరూర్ (1,072)పై ఖర్గే (7,897) 6,825 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. 416 ఓట్లు చెల్లలేదు. మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తలు ఏఐసీసీ కార్యాలయం వద్ద, అలాగే ఖర్గే సొంత రాష్ట్రం కర్నా టక, ముంబయితో పాటు పలు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకున్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ప్రముఖులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈనెల 17న జరిగింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫలితాలను కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మెన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.
ఖర్గే మార్గదర్శకంలో నడుస్త్ణాం శశిథరూర్
కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు శశిథరూర్ అభినందనలు తెలిపారు. ఆయన గెలుపు, కాంగ్రెస్ గెలుపని అన్నారు. ''నిజమైన పార్టీ పునరుద్ధరణ ప్రక్రియ ఈరోజుతో మొదలైనట్టు నేను నమ్ముతున్నాను'' అని పేర్కొన్నారు. ''పార్టీ ప్రతినిధుల నిర్ణయమే అంతిమం. నేను దానిని వినమ్రంగా అంగీకరిస్తున్నాను. పార్టీ కార్యకర్తలు తమ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం కల్పించే పార్టీలో సభ్యుడిగా ఉండటం విశేషం'' అని థరూర్ పేర్కొన్నారు. ''మా కొత్త అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో మనమందరం సమిష్టిగా పార్టీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని విశ్వసిస్తున్నాను'' అని అన్నారు.
ప్రమాదంలో కాంగ్రెస్ణ్ మల్లికార్జున్ ఖర్గే
శశిథరూర్, తాను కలిసి పని చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జన్ ఖర్గే అన్నారు. ఘనవిజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసినందుకు థరూర్‌ను అభినందించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ ఎన్నికలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పటిష్టం చేసిందనీ, ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు.
రెండు దశాబ్దాల తరువాత గాంధీ యేతర అధ్యక్షుడు
137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీకి 24 ఏండ్ల(రెండు దశాబ్దాల) తరువాత నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కానివారు కాంగ్రెస్ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ఖర్గే మూడో దళిత నేతగా నిలిచారు. అంతకు ముందు 1962లో దామోదరం సంజీవయ్య, 1970 బాబు జగ్జీవన్ రామ్ దళిత వర్గాలకు చెందినే వారే కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. అలాగే కర్నాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షులు అయిన రెండో వ్యక్తిగా ఖర్గే నిలిచారు. అంతకుముందు 1998లో ఎస్. నిజలింగప్ప కర్నా టక నుంచే ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.
కార్మిక నేత నుంచి...ఏఐసీసీ అధ్యక్షుడి వరకు
మాపన్న మల్లికార్జున్ ఖర్గే కర్నా టకలోని బీదర్ జిల్లా భాల్కి తాలూకాలోని వరవట్టిలో మాపన్న ఖర్గే, సబవ్వ దంపతలకు 1942 జులై 21న జన్మించారు. ఆయన గుల్బర్గాలోని నూతన్ విద్యాలయం నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. గుల్బర్గాలోని ప్రభుత్వ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, గుల్బర్గాలోని సేథ్ శంకర్‌లాల్ లాహౌటి న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందాడు. అతను తన న్యాయవాద వృత్తిని జస్టిస్ శివరాజ్ పాటిల్ కార్యాలయంలో జూనియర్‌గా ప్రారంభించాడు. తన న్యాయవాద వృత్తి ప్రారంభంలో కార్మిక సంఘాల హక్కుల కోసం పోరాడారు. ఖర్గే తన రాజకీయ జీవితాన్ని గుల్బర్గాలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభించారు. 1969లో అతను ఎంఎస్కె మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్‌కు న్యాయ సలహాదారు ఉన్నాడు. అతను సంయుక్త మజ్దూర్ సంఘంలో కార్మిక సంఘం నాయకుడు కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు, ఆందోళనలకు నాయకత్వం వహించారు. 1969లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. ఆయన తొలిసారిగా 1972లో ఆ తరువాత 1978, 1983, 1985, 1989, 1999, 2004 వరకు వరుసగా గుర్మిత్కల్ నియోజర్గం నుంచి, 2008లో చితాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. 2009, 2014ల్లో ఆయన గుల్బర్గా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వరుసగా 11 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2009-2019 మధ్యకాలంలో ఆయన కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రి, కార్మిక, ఉపాధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మల్లికార్జున్ ఖర్గే 2014-2019లో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన ఖర్గే 12 జూన్ 2020న కర్నా టక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 16 ఫిబ్రవరి 2021 నుంచి 01 అక్టోబర్ 2022 వరకు రాజ్యసభ ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడంతో రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు.