Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో : ఓసీసీఆర్పీ
న్యూఢిల్లీ : దేశీయ నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపు నుంచి హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. ఈ హార్డ్‌వేర్ పెగాసస్ స్పైవేర్‌ను మోహరించేందుకు ఉపయోగించిన మ్యాచింగ్ కిట్ పరికరంతో సరిపోలుతోందని సంఘటిత నేరాలు, అవినీతి రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) తన నివేదికలో పేర్కొంది. అంతమాత్రం చేత పెగాసస్‌కు దిగుమతి చేసుకున్న ఈ హార్డ్‌వేర్‌ను ఉపయోగించామని నిర్ధారించడం సాధ్యం కాదని ఆ నివేదిక పేర్కొంది. 2017 ఏప్రిల్ 18న ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్ఎస్ఓ నుంచి హార్డ్‌వేర్‌ను అందుకుంది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించేందుకు ఉపయోగించిన పరికరంలో వాడినటువంటిదే ఈ హార్డ్‌వేర్ అని ఇంపోర్ట్ డేటా తెలియజేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. విమానంలో ఈ హార్డ్‌వేర్ ఢిల్లీకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులు, దిగుమతుల షిప్మెంట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించే వాణిజ్య వెబ్సైట్ ద్వారా ఈ డేటాను తాము పొందినట్లు ఓసీసీఆర్పీ పేర్కొంది. డబ్బులు చెల్లించి మరీ ఈ వెబ్సైట్ సేవలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇలా వచ్చిన సరుకులో డెల్ కంప్యూటర్ సర్వర్లు, సిస్కో నెట్వర్క్ పరికరాలు, విద్యుత్ పోయినపుడు కూడా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసే బ్యాటరీలు వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య డేటా వేదిక ద్వారా పొందిన బిల్లుతో ఈ వివరాలు తెలిసాయని నివేదిక పేర్కొంది. ఈ సరుకు విలువ 315 డాలర్లు (ఆ సమయానికి రూ.2కోట్ల పై మాటే), రక్షణ, సైనికపరమైన ఉపయోగాల నిమిత్తం దీన్ని తెప్పించుకుంటున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ''ఈ వివరణ అంతా అంటే సరుకు వచ్చిన సమయం, ఆ తీరు చూస్తుంటే న్యూయార్క్ టైమ్స్ జనవరిలో ఇచ్చిన వివరాలతో సరిపోలుతోందని నివేదిక పేర్కొంది. భారత్, ఇజ్రాయిల్ మధ్య 2017లో కుదిరిన ఆయుధ ఒప్పందంలో పెగాసస్, క్షిపణి వ్యవస్థ ముఖ్యమైనవని న్యూయార్క్ టైమ్స్ ఆనాడు వెల్లడించింది. ఈ హార్డ్‌వేర్‌ను పెగాసస్ కోసం ఉపయోగించారా లేదా అనేది నిర్ధారించలేకపోయినప్పటికీ, 2019లో ఎన్ఎస్ఓ గ్రూపునకు వ్యతిరేకంగా మెటా దాఖలు చేసిన కేసులో అమెరికా కోర్టుకు అందజేసిన పెగాసస్ బ్రోచర్లో వున్న వివరాలు మాత్రం ఒకేలా వున్నాయని నివేదిక పేర్కొంది. 2017లో భారత ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు సీనియర్ అధికారి, కాంట్రాక్టర్, ధ్రువీకరించారని ఓసీసీఆర్పీ నివేదిక పేర్కొంది. ఈ సరుకు గురించి తాము పంపిన ప్రశ్నలకు అటు ఎన్ఎస్ఓ గ్రూపు కానీ, ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ స్పందించలేదని ఓసీసీఆర్పీ పేర్కొంది. ఇజ్రాయిల్‌తో కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని ఈ ఏడాది ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పెగాసస్ అనేది మిలటరీ తరహా స్పైవేర్. దీనిద్వారా అవసరమైన వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పూర్తిగా మనం అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. క్రిమినల్, తీవ్రవాద ముఠాలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నామని ఆ కంపెనీ తెలిపింది. భారతదేశంలో దీన్ని జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు ఉపయోగించినట్టు వెల్లడైంది. భారత ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని ధ్రువీకరించలేదు, ఖండించనూ లేదు. దీనిపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు కమిటీ కూడా వేసింది.
మోడీ జీ ! ఇప్పటికైనా ఒప్పుకోండి : ఏచూరి
'ప్రతిపక్ష పార్టీల నేతలు, ఎన్నికల కమిషనర్లు, న్యాయ వ్యవస్థ సభ్యులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసి, వారిపై నిఘా పెట్టడానికి పెగాసస్‌ను ఉపయోగించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించడానికి ముందుకు రావాలి. వాస్తవాన్ని ఎంతోకాలం దాచిపెట్టలేమని' సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన యంత్రాంగాల ద్వారా మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తన చర్యలకు బాధ్యత వహించాలని ఆయన ట్వీట్ చేశారు. కోర్టులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని, బాధ్యులెవరో నిర్ధారించాలని కోరారు.