Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100వ పడిలోకి వి.ఎస్.అచ్యుతానందన్
- సీనియర్ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ సీఎంగా సేవలు
తిరువనంతపురం : సీనియర్ కమ్యూనిస్ట్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్. అచ్యుతానందన్ గురువారం 100పడిలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర సామాజిక, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ, అనుభవజ్ఞుడిగా పేరుగడించిన ఆయన విఎస్. హార్ట్‌స్ట్రోక్‌తో గత నాలుగేండ్లు గా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్షనేతగా విధులు నిర్వహించారు. 2016-2021 మధ్య రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మెన్‌గా కూడా పనిచేశారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం, స్వాతంత్య్రానికి ముందు , నిస్సందేహంగా కేరళ సామాజిక రాజకీయ చరిత్రతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నది. కమ్యూనిస్ట్కి కాపీబుక్గా పేరు పొందడంతో పాటు ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి కీలకంగా నిలిచిన రాజకీయ నేత వంటి అనేక గుర్తింపులు పొందిన విఎస్ వంటి వ్యక్తి మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1923, అక్టోబర్ 20న అలప్పుజా జిల్లాలోని పున్నప్రా గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన ఏడో తరగతితో చదువు ఆపేశారు. జీవనోపాధి కోసం సోదరుని టైలరింగ్ షాపులో పనిచేసేవారు. 15 ఏండ్ల వయస్సులో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. రెండేండ్ల అనంతరం అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో (సీపీఐ) సభ్యుడిగా చేరారు. మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, కొబ్బరిచెట్లు ఎక్కేవారితో కలిసి పనిచేశారు. 1940లో కామ్రేడ్ పి.కృష్ణపిళ్లైని కలవడంతో ఆయన రాజకీయ జీవితం మరింత చురుగ్గా ముందుకు సాగింది. కొబ్బరి తోటల్లో పనిచేసే కార్మికులను కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల కోసం కార్మికులతో మమేకమయ్యేందుకు చెక్క వంతెనలపై కాలువలను దాటుతూ అనేక కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
అలప్పుజ జిల్లా ఏర్పడిన అనంతరం సీపీఐ జిల్లా సెక్రెటరీగా, 1954లో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. 1964లో సీపీఐ(ఎం) ని ఏర్పాటు చేసేందుకు పార్టీ జాతీయ మండలి నుంచి వైదొలిగిన 32 మంది సీపీఐ నేతలలో విఎస్ కూడా ఒకరు. 1967, 1971లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1980లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనపుడు తిరిగి సంస్థాగత రాజకీయాల్లోకి మారారు. 12 ఏండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆసమయంలో రాజీలేని పనితీరుతో, పట్టుదలతో పార్టీలో గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. విఎస్ని కేరళ ఫైడల్ కాస్ట్రో అంటూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అభివర్ణించారు. పార్టీకి మార్గనిర్దేశం చేస్తూ.. స్ఫూర్తిగా నిలిచారు.