Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను కోరిన ఎస్టీ కమిషన్
న్యూఢిల్లీ : జూన్లో తీసుకొచ్చిన నూతన అటవీ సంరక్షణ నిబంధనలు 2022, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నాయని పేర్కొంటూ వెంటనే వాటిని నిలిపివేయాల్సిందిగా జాతీయ ఎస్టీ కమిషన్ (ఎన్సీఎస్టీ) కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను కోరింది. ప్రాజెక్టు క్లియరెన్స్కి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2006నాటి అటవీ హక్కుల చట్టంలో పొందుపరచబడిన అటవీవాసుల హక్కులను కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించేందుకు ప్రతిపాదించిన అటవీ భూమిలో గల ఎస్టీలు, ఇతర సాంప్రదాయ నివాసులు (ఓటీఎఫ్డీఎస్)కు అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ) నిబంధనలు మంజూరు చేసేందుకు 2017 నాటి నిబంధనల అమలును పునరుద్ధరించి, బలోపేతం చేసి, కఠినంగా పర్యవేక్షించాల్సిందిగా కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. పెరుగుతున్న వివాదంపై తీవ్రంగా జోక్యం చేసుకుంటూ, అటవీ సంరక్షణ నిబంధనలు 2014-2017లో కల్పించబడిన 'సమ్మతి క్లాజు'ను అటవీ సంరక్షణ నిబంధనలు-2022లో ఎత్తివేశారని ఎన్సీఎస్టీ నిర్ధారణకు వచ్చింది. 'స్టేజ్ 1 క్లియరెన్స్' కోసం అటవీ భూమిని మళ్లించాలన్న ప్రతిపాదనను పంపడానికి ముందుగా గిరిజనుల అటవీ హక్కులను అధికారులు గుర్తించాలని, గ్రామసభల ఆమోద ముద్ర కూడా పొందాల్సి వుందని ఎఫ్ఆర్ఏ కింద పేర్కొన్న నిబంధనను ఈ సమ్మతి క్లాజు అమలు చేస్తోంది. ఎన్సీఎస్టీ చైర్మెన్ హర్ష చౌహాన్ ఈ మేరకు పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్కు లేఖ రాశారు. ''ప్రస్తుత నిబంధనలు ముందుగా సమ్మతి లేదా ఆమోదం కోరాల్సిన అవసరాన్ని ఎత్తివేశాయి. స్టేజ్ 1 క్లియరెన్స్ లేదా స్టేజ్ 2 క్లియరెన్స్ తర్వాత
అటవీవాసుల హక్కులను గుర్తించే ప్రక్రియను చేపట్టడాన్ని వదిలివేశాయి.'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ''భూమి బ్యాంకులు ఏర్పాటు చేయడంలో, గుర్తింపు పొందిన నష్టపరిహార అడవుల పెంపకం క్రమాల్లో నిబంధనలు-2022 ఎఫ్ఆర్ఏను కూడా ఉల్లంఘిస్తున్నాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అటవీ సంరక్షణ నిబంధనలు-2022 తీసుకొచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఎఫ్ఆర్ఏ కింద మంజూరైన అటవీవాసుల హక్కుల విషయంలో రాజీపడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆనాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వున్న మల్లికార్జున ఖార్గె దీనిపై ఎన్సీఎస్టీకి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం విషయాన్ని కూలంకషంగా పరిశీలించేందుకు గిరిజన ప్యానెల్ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన ప్రాధమిక విచారణలో ఈ ఆరోపణలు నిజమేనని అంగీకరించింది. పైన పేర్కొన్న నిబంధనలు ఎఫ్ఆర్ఏను ఉల్లంఘించడం లేదనీ, ఎందుకంటే ''ఇవి సమాంతర చట్టపరమైన క్రమాలు'' అని అటవీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సమర్ధించుకోవడాన్ని ఎన్సీఎస్టీ చైర్మెన్ తోసిపుచ్చారు. అటవీ భూముల మళ్లింపునకు సంబంధించిన భయంకరమైన పరిస్థితులను చెప్పడానికి అధ్యయనాలను చౌహాన్ ఉదహరించారు. ''ఎఫ్ఆర్ఏ, అటవీ సంరక్షణ చట్టం కింద గల ప్రక్రియల అమలును వేర్వేరు సమాంతర క్రమాలుగా చూడలేమనడానికి ఇదే కారణం. బదులుగా, రెండు చట్టాలను పరస్పరం అనుసంథానించుకుంటూ అమలు చేయాల్సిన అవసరం వున్నదని'' తన లేఖలో పేర్కొన్నారు. ఎస్టీలు, ఓటీఎఫ్డీఎస్ల అటవీ హక్కులను గుర్తించడానికి గానూ ఎఫ్సీఏ కింద అడవుల మళ్లింపు ఎఫ్ఆర్ఏ నేపథ్యంలో సవరణకు సిద్ధంగా వుండాలన్న సూత్రాన్ని 2009 ఆగస్టు 3నాటి అటవీ మంత్రిత్వ శాఖ సర్క్యులర్, 2013 నాటి సుప్రీం కోర్టు నియంగిరి తీర్పు, 2014/ 2017 నాటి అటవీ సంరక్షణ సవరణ నిబంధనలు పరిరక్షించాయని చౌహాన్ వాదించారు.