Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్కిస్‌బానో దోషులపై ఎఫ్ఐఆర్, రెండు ఫిర్యాదులు
న్యూఢిల్లీ : బిల్కిస్‌బానోపై సామూహిక లైంగికదాడి చేసి, ఆమె కుటుంబమంతటినీ పాశవికంగా హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను సత్ప్రవర్తనపై విడుదల చేశామనీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సైతం తమ నిర్ణయాన్ని ఆమోదించిందని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దోషుల్లో కొందరు 2017-2021 మధ్య పెరోల్‌పై విడుదలైన సమయంలో కేసులను ఉపసంహరించు కోకపోతే హత్య చేస్తామని బెదిరించారని సాక్షులు ఇచ్చిన ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్టు ఎన్డీటీివి పరిశోధనలో వెల్లడైంది. దోషులపై నమోదైన ఓ ఎఫ్ఐఆర్, రెండు ఫిర్యాదుల కాపీలను ఎన్డీటీవీ విడుదల చేసింది. 2020 జులై 6న దోషులు రాథేశ్యామ్ షా, మితేష్భారుభట్లపై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. బిల్కిస్‌బానో కేసులో ఇద్దరు దోషులతోపాటు రాథేశ్యామ్ సోదరుడు ఆషిష్ సాక్షులు పింటుభారు, సబేరాబెన్ పటేల్, సబేరాబెన్ కుమార్తె అర్ఫాలను బెదిరించారని దాహోద్‌లోని రాధికాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 354, 504, 506, 114 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021, జనవరి 1న మరోసాక్షి మన్సూరీ అబ్దుల్ రజాక్ కూడా దోషులు బెదిరించినట్టు దాహోద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడం గమనార్హం. రాజీకి అంగీకరించకపోతే చంపేస్తా నని దోషుల్లో ఒకరైన గోవింద్నారు బెదిరించాడని మరో ఇద్దరు సాక్షులు ఘంచి అదంబారు ఇస్మాయిల్ బారు, ఘంచి ఇంతియాజ్బారు యూసఫ్బారు 2017, జులై 28న ఫిర్యాదు చేశారు. రాజీకి అంగీకరించకపోతే చంపేస్తా మని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కూడా ఎఫ్ఐఆర్గా మారలేదు. ఈ ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే దోషుల క్రూర ప్రవర్తన ఏమాత్రం మారలేదని అర్థమవుతూనే ఉంది. అయిన ప్పటికీ, అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి నేరస్తుల విడుదలను ఇప్పటికీ సమర్థిస్తూనే ఉన్నారు. వారి విడుదల పద్ధతి ప్రకారమే జరిగిందని, విడుదలలో ఎటువంటి తప్పు కనిపించడం లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.