Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులతో పాటు అరెస్టులు
- పశ్చిమ బెంగాల్లో పోలీసుల అరాచకం
- అరెస్టు చేసిన వారిలో అచూకీ తెలియని ముగ్గురు నేతలు
కొల్కతా : తమకు ఉద్యోగాలు కల్పించాలని కొన్ని రోజుల నుంచి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ అభ్యర్ధులపై గురువారం అర్ధరాత్రి సమయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలు, వారి పిల్లలు అని కూడ చూడకుండా అభ్యర్ధులపై దాడులకు పాల్పడ్డారు. అర్థరాత్రి వారిని పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసుల అరాచకాన్ని సీపీఐ(ఎం)తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రం అంతటా ఆందోళనలు నిర్వహించాయి. 2014 టీచర్స్ ఎలిజిబెటీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు తమకు డైరెక్ట్ రిక్యూట్మెంట్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి నుంచి కొల్‌కతాలోని సాల్ట్ లేక్ వద్ద ఉన్న ఎడ్యుకేషన్ బోర్డు కార్యాలయం బయట నిరాహార దీక్ష చేస్తున్నారు. నియమాకల్లో రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, అనర్హులకు ప్రాధాన్యత ఇస్తుందని వీరు ఆరోపిస్తున్నారు. వీరిపై గురువారం అర్థరాత్రి పోలీసులు ఒక్కసారిగా అణిచివేతకు పాల్పడ్డారు.
గురువారం రాత్రి అధిక సంఖ్యలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది నిరాహార దీక్షా స్థలి వద్దకు బస్సుల్లో చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. నిరసన చట్ట విరుద్ధమనీ, ఈ ప్రాంతాన్ని రెండు నిమిషాల్లో ఖాళీ చేయాలని అభ్యర్థుల్ని ఆదేశించారు. అభ్యర్ధులు అందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించేందుకు బరిలోకి దూకారు. కేవలం 15 నిమిషాల్లోనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారంటే వారు ఎంత నిరంకుశంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు.
మహిళలని కూడా చూడకుండా అభ్యర్థులందర్నీ బస్సుల్లోకి లాగారు. కొంత మంది అభ్యర్ధులు బస్సు చక్రాల కింద పడి పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులను వారిని బలవంతంగా బయటకు లాగారు. పోలీసుల దాడుల్లో అనేక మంది అభ్యర్ధులు కింద పడిపోగా, మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులే అంబులెన్స్‌ల్లో తరలించారు. అదుపులోకి తీసుకున్న అభ్యర్థుల్ని బిధాన్నగర్ నార్త్ పోలీస్ స్టేషన్, న్యూటౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తరువాత వారిని ధర్మతల, సీల్దా, హౌరాల్లో విడిచిపెట్టారు. అయితే అరెస్టు చేసిన వారిలో ముగ్గురు నేతల ఆచూకీ తెలియడం లేదని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. టెట్ గ్రాడ్యుయేట్ అర్గనైజేషన్ సంయుక్త కార్యదర్శి అర్నాబ్ ఘోష్‌తో పాటు, అచింత్య సమంత్, అచింత్య ధర కనిపించడం లేదని చెబుతున్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. పోలీసులు ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించలేదు. ఈ ముగ్గుర్ని విడిచిపెట్టాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని అభ్యర్ధులు హెచ్చరిస్తున్నారు.
ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతల అరెస్టు
టెట్ అభ్యర్ధులపై పోలీసుల దూకుడుకు వ్యతిరేకంగా శుక్రవారం ఆందోళనకు పిలుపు ఇచ్చిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మధుజా సేన్ రారు, సయందీప్ మిత్రా వంటి ఎస్ఎఫ్ఐ నేతలన్నీ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీతో సహా మయుక్ బిస్వాస్, పలస్ దాస్ వంటి నాయకుల్ని పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఐటీయూ ఖండన
నిరాహార దీక్ష చేస్తున్న టెట్ అభ్యర్ధులపై తృణమూల్ ప్రభుత్వం చేసిన దాడిని సిఐటియు తీవ్రంగా ఖండించింది. పశ్చిమ బెంగాల్లో టిఎంసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ కుంభకోణాలు ప్రారంభమయ్యాయని విమర్శించింది. ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, అర్హత కలిగిన అభ్యర్థులకు మొండిచేయి చూపుతూ, వందల కోట్లు దోచుకున్నారని పేర్కొంది.
ఇప్పటికే మాజీ విద్యాశాఖ మంత్రి నుంచి బోర్డు అధ్యక్షుడు వరకూ జైలుల్లో ఉన్నారని తెలిపింది. కళింకిత మంత్రులు, వారి సన్నిహతుల నుంచి హార్డ్ క్యాష్ రూపంలో కోట్ల డబ్బును విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేసింది. న్యాయమైన డిమాండ్లతో నిరసన చేస్తున్న అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు కూడా మమతా ప్రభుత్వం విముఖత చూపిందని విమర్శించింది. టెట్ అభ్యర్ధుల పోరాటానికి సిఐటియు సంఘీభావం తెలిపింది. ఉద్యమానికి సంఘీభావం తెలపాలని బెంగాల్ శ్రామిక వర్గానికి సిఐటియు పిలుపునిచ్చింది.