Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక శక్తులు ఏకం కావాలి..
- ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి : ఏచూరి
- ఎన్నికలు రాగానే బీజేపీకి పాలు, వంటగ్యాస్ సబ్సిడీ గుర్తుకొచ్చాయి..
న్యూఢిల్లీ : ద్వేషం, హింస, మత రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడ ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో నెలకొన్న ఫాసిస్టు పాలనను త్రిపుర ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అశ్వమేథ యాగాన్ని రైతులు, కార్మికుల మద్దతుతో ఎర్రజెండా నిలువరిస్తుంద న్నారు. ''ఎన్నోవేల మంది నా ముందు నిలబడి ఉన్నారు. బీజేపీ పాలనకు ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పడానికి ఇదొక అవకాశ''మని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలవేళ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో త్రిపుర ప్రజలు గమనించాలని ఏచూరి కోరారు. పాల ధర పెంచుతూ, వంటగ్యాస్ సబ్సిడీ ఎత్తేస్తూ...లబ్దిదారులకు ఇస్తున్న ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సబ్సిడీలు ఇవ్వటం పనికిరాని ప్రయోజనాలగా కొట్టిపారేసింది. ఇప్పుడు ఎన్నికలు రావటంతో ఆ రాష్ట్రాల్లో ఓట్లు దండుకోవడానికి పాల ధరను తగ్గిస్తోందని, ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ చెబుతోందని ఏచూరి ప్రస్తావించారు. రేపు త్రిపుర ఎన్నికల సమయంలోనూ బీజేపీ నాయకులు ఇలాగే వస్తారని, ప్రజల్ని మభ్యపెడతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ నాయకులు చెప్పే మాటలకు మోసపోకుండా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ''కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ-1 హయాంలో వామపక్షాలు ప్రజానుకూల విధానాలను సాధించాయి. ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, విద్యాహక్కు చట్టం..మొదలైనవి కమ్యూనిస్టులు తీసుకురాగలిగారు'' అని అన్నారు. కేంద్రంలో మరింత మెరుగైన ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కమ్యూనిస్టులు కృష్టి చేస్తారని చెప్పారు.
బలిదానినికి సైతం వెనుకాడవద్దు : మాణిక్ సర్కార్
బీజేపీ దాడులు ఎదుర్కోవడానికి కమ్యూనిస్టు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర ప్రతిపక్ష నాయకుడు మాణిక్ సర్కార్ అన్నారు. బీజేపీ దాడుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. గాయపడటానికి అవసరమైతే బలిదానానికి కూడా వెనుకాడవద్దని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో త్రిపురలో బీజేపీ ఓటమి కోసం కృషి చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగులు, యువకులు, సామాన్య ప్రజలపై అధికార బీజేపీ వాగ్ధానాల వర్షం కురిపిస్తుందని, వీటికి ఆకర్షితులు కావొద్దని ఆయన ఓటర్లను హెచ్చరించారు. బీజేపీ స్థానంలో ప్రజానుకూలమైన, లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.