Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రులకు చెల్లింపులు చేయని కేంద్రం
- ఇప్పటి వరకు రూ.1300 కోట్లు బాకీ
- మూడు లక్షల కేసులలో బకాయిలు
- రిజిస్ట్రేషన్‌ను నిలిపేస్తున్న దవాఖానాలు
- కేంద్రప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్)కు మోడీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. ఈ పథకం కింద ప్రయివేటు ఆస్పత్రులకు చేయాల్సిన చెల్లింపుల్లో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ. 1300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రయివేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. సీజీహెచ్ఎస్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకం కింద ప్రయివేటు ఆస్పత్రులలో నగదు రహిత చికిత్సను పొందుతుంటారు. అయితే, కేంద్రం బకాయిలు చెల్లించకపోవటం.. ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ను ఆపుతుండటంతో.. లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ పథకం కింద 38 లక్షల మంది రోగులకు చికిత్సలు అందించిన తర్వాత దాదాపు రూ. 3100 కోట్లకు సంబంధించిన క్లెయిమ్‌లను ఆస్పత్రులు సీజీహెచ్‌ఎస్‌కు పంపాయి. ఇందులో ఇప్పటి వరకు 29 లక్షల క్లెయిమ్‌లకు రూ. 1756 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ. 1300 కోట్లకు పైగా చెల్లింపులు ప్రయివేటు ఆస్పత్రులకు బాకీ పడి ఉన్నాయి. సీజీహెచ్ఎస్ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 42 లక్షల మంది ప్రజలు లబ్ది పొందతున్నారు.రోగి చికిత్స పొంది ఏడాదికి పైగా గడుస్తున్న 1.3 లక్షల కేసుల్లో ప్రయివేటు ఆస్పత్రులకు రూ. 103 కోట్లు బాకీ పడి ఉన్నాయి. వీటిని సీజీహెచ్ఎస్ ఇప్పటికీ చెల్లించకపోవటం గమనార్హం. అలాగే, చికిత్స జరిగి ఆరు నెలల నుంచి ఏడాది గడిచిన రెండు లక్షలకు పైగా కేసులలో రూ. 230 కోట్ల బకాయిలు ఉన్నాయి. చికిత్స పూర్తయిన తర్వాత మూడు నుంచి ఆరునెలల తర్వాత కూడా ఒక లక్ష మంది రోగులకు సంబంధించిన రూ. 164 కోట్ల చెల్లింపులు జరగలేదు. ఇక మరి కొన్ని కేసులలో 90 రోజుల తర్వాత కూడా నాలుగు లక్షలకు పైగా కేసులలో రూ. 305 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇలాంటి 74 వేల కంటే ఎక్కువ మంది రోగుల చికిత్స కోసం బకాయిలు ఉన్నాయి. వీరి చికిత్సకు రూ. 1 లక్షల లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 54 వేల మందికి రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష చొప్పున చికిత్స బిల్లులు బకాయి ఉన్నాయి. అయితే, కొన్ని కేసులలో ఆస్పత్రులు చేసిన క్లెయిమ్‌లు తిరస్కరించబడటం గమనార్హం. ఈ విధంగా పేరుకుపోయిన బకాయిలు ఆస్పత్రులకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. దీంతో ఈ భారాన్ని తప్పించుకునే ందుకు సీజీహెచ్ఎస్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నాయి. ఈ కారణంతో లబ్దిదారులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సీజీహెచ్ ఎస్‌ను కేంద్రం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.