Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ బద్దమైన మండల్ కమిషన్ సిపార్సులు అమలుచేయాలి
- ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిసిన బీసీ సంఘం నేతలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో బీసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ, అలాగే రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ మిగతా సిఫార్సులు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, కన్వీనర్ గుజ్జ కృష్ణ, దక్షిణ భారత సంఘం అధ్యక్షులు జబ్బాల శ్రీనివాస్, జాతీయ ఓబీసీ సంఘం అధ్యక్షులు ఎ. వరప్రసాద్, జాతీయ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్, సున్నం మల్లికార్జున్, ఓం ప్రకాష్ కలిశారు. ఈ సందర్భంగా జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు వర్తింపజేయాలనీ, దేశంలోని ప్రతి యూనివర్సిటీలో పరిశోధనాత్మక విద్యార్థులకు 50 మంది రాజీవ్ ఫెలోషిప్ పథకాన్ని అమలు చేయాలనీ, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 75 సంవత్సరాల తర్వాత ప్రత్యేక బీసీి మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం అన్యాయమని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన మండల కమిషన్ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందనీ, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.