Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషనర్‌పై మండిపడ్డ సుప్రీం
న్యూఢిల్లీ : తాజ్‌మహల్ చరిత్రపై దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ ప్రాచీన కట్టడ ప్రాంగణంలోని 22 గదులను తెరవాలని చేసిన విజ్ఞప్తిలో ప్రజా ప్రయోజనం లేదనీ, అది ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమేనని అభిప్రాయపడింది. దీనిని తోసిపుచ్చుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తాజ్‌మహల్ చరిత్రతో పాటు ఆ ప్రాంగణంలోని 22 గదులు తెరవడంపై విచారణ జరపాలని ఆయోధ్యకు చెందిన బీజేపీ నేత, మీడియా ఇంచార్జ్ రజ్నీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. 'ఈ పిటిషన్‌ను కొట్టివేయడంలో హైకోర్టు తప్పేమీ లేదు. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం మాత్రమే. దీనిని తోసిపుచ్చుతున్నాం' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
తాజ్‌మహల్ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన బీజేపీ నేత, మీడియా ఇంచార్జ్ రజ్నీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆదేశానుసారం తాజ్‌మహల్ లోపల దాగి ఉన్నట్టు విశ్వసించే విగ్రహాలు, శాసనాలు వంటి ''ముఖ్యమైన చారిత్రక ఆధారాలను వెతకడానికి'' వాస్తవ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో పేర్కొన్నారు. తాజ్ మహల్ పాత శివాలయమనీ, దీనిని తేజో మహాలయ అని చాలా మంది చరిత్రకారులు సమర్థించారని అనేక హిందూ సంఘాలు వాదిస్తున్నాయని తెలిపారు. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషనర్ తరపున న్యాయవాదిని మందలించిన హైకోర్టు, ఆ వ్యాజ్యాన్ని మే 12న కొట్టివేసింది. దానిని సవాలు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కూడా వారికి చుక్కెదురయ్యింది.