Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తతరం బాలిస్టిక్ మిస్సైల్..పరిధి 2వేల కి.మీ
న్యూఢిల్లీ : కొత్త తరం బాలిస్టిక్ మిస్సైల్ 'అగ్ని ప్రైమ్'ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. అణు సామర్థ్యంగల ఈ క్షిపణిని ఒడిషాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు. పరీక్ష లక్ష్యాలన్నింటినీ అత్యత కచ్చితత్వంతో మిస్సైల్ ఛేదించింది. వరుసగా మూడోసారి నిర్వహించిన ఈ పరీక్షలు ఈ వ్యవస్థ కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను నిరూపించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ వంటి అనేక ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిస్సైల్ పనితీరును మదింపు చేసినట్టు తెలిపారు. ఈ సిస్టమ్స్‌ను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టెర్మినల్ పాయింట్ వద్ద రెండు డౌన్-రేంజ్ నౌకలు సహా ఫ్లైట్ పాత్లో వీటిని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. అగ్ని ప్రైమ్ మొదటి రెండు పరీక్షలు గత ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో జరిగాయని, ఈ రెండు పరీక్షల్లోనూ ఈ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలని ఛేదించిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అగ్ని తరగతిలో అగ్ని-పీ నవతరానికి సంబంధించిన అత్యాధునికమైనది. అణుసామర్థ్యం కలది కూడా. ఈ మిస్సైల్ పరిధి రెండువేల కిలోమీటర్లు.