Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే సమాజంలో శాశ్వతంగా ఉండిపోతాయి : ఆక్స్‌ఫామ్-డీఎఫ్ఐ నివేదిక
- కార్మిక హక్కులు, పన్ను విధానాలు, సామాజిక పథకాలే అత్యంత కీలకం
- వీటిని విస్మరించటం వల్లే భారత్‌లో అసమానతలు తీవ్రరూపం
- కొన్ని దశాబ్దాల ప్రభుత్వాల కృషి కనుమరుగయ్యే ప్రమాదం..
కోవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన అసమానతలు ముఖ్యంగా భారత్‌ను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఏకపక్ష ధోరణితో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు చేసింది. సామాజిక పథకాలపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించింది. కార్మిక హక్కులను బలహీనపర్చింది. అత్యంత ధనికులు, బడా కార్పొరేట్లకు అనుకూలమైన పన్ను విధానాలు ఎంచుకుంది. వీటి పర్యావసనమే నేడు అంతర్జాతీయ సూచికల్లో భారత్ ర్యాంక్ దెబ్బతింటోంది. ఇదే విషయాన్ని తాజాగా మరో అంతర్జాతీయ అధ్యయనం ప్రస్తావించింది. అంతర్జాతీయంగా అసమానతలు, పేదరికం తీవ్రరూపం దాల్చుతు న్నాయని 'కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇనిక్వాలిటీ' (సీఆర్ఐ-2022) నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదికను 'ఆక్స్‌ఫామ్-డీఎఫ్ఐ' (డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్) సంయుక్తంగా రూపొందించాయి.
న్యూఢిల్లీ : కోవిడ్ తర్వాత ఏర్పడ్డ ఆర్థిక అసమానతలు శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదముందని ఈ నివేదికలో పరిశోధకులు హెచ్చరించారు. 161దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, భారత్‌కు 123వ స్థానం దక్కింది. నార్వే, జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, జపాన్, డెన్మార్క్, న్యూజీలాండ్ మొదటి ముందు భాగంలో నిలిచాయి.
ప్రభుత్వాలు విఫలం
అసమానతలు ప్రమాదకర స్థాయిలో పెరగకుండా అడ్డుకోవటంలో చాలా ప్రభుత్వాలు విఫలమయ్యాని సీఆర్ఐ-2022 విశ్లేషించింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నప్పటికీ పేద ప్రజలు సుదీర్ఘకాలంగా నష్టాన్ని చవిచూస్తున్నారు. సామాజిక పథకాలపై ప్రభుత్వ వ్యయం, పన్నులు, కార్మిక విధానాలు..కీలకం. ప్రజా ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత అంశాల్లో భారత్ చాలా వెనుకబడి ఉంది. ఇక ఆరోగ్య సంరక్షణ విషయంలో 161దేశాల్లో చివరిస్థానంలో ఉంది. ఈ రంగంలో ఇకపై భారత్ చేయాల్సింది ఎంతో ఉంది. కానీ పాలకులు అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. భారత్ వ్యయం కేవలం 3.64శాతానికి పరిమితమైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్ 4.3శాతం, బంగ్లాదేశ్ 5.9శాతం, శ్రీలంక 5.88శాతం, నేపాల్ 7.8శాతం ఖర్చు చేస్తున్నాయని 'సీఆర్ఐ 2022' నివేదిక వెల్లడించింది.
పాలకులదే బాధ్యత
కారణాలేమైనా మోడీ సర్కార్ పాలనలో ఆర్థిక, ఆదాయ అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వీటిని సాధారణస్థితికి చేర్చాల్సిన బాధ్యత పాలకులదే. అసమానతలు తగ్గుముఖం పట్టకపోతే.. కోవిడ్ సంక్షోభం తెచ్చిపెట్టిన మార్పులు శాశ్వతంగా నిలిచిపోతాయి. దాంతో కోట్లాది కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. సమాజంలో పేదరికం పెరిగితే..విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు..అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. కోవిడ్-19 సంక్షోభం అన్ని రంగాల్ని దెబ్బతీసింది. లాక్డౌన్, కరోనా నిబంధనలు.. అనేకమందికి ఉపాధి దూరం చేసింది. అనేకమంది ఆదాయ పడిపోయి.. సమాజంలో ఆర్థిక అసమానతల్ని మరింత పెంచింది.
ప్రజాసేవలు దూరం
భారత్‌కు సంబంధించి కోవిడ్ సంక్షోభ సమయం 2020-2022లో అత్యంత ముఖ్యమైన ప్రజా సేవలకు పేద, మధ్య తరగతి ప్రజలు దూరమయ్యారు. మరోవైపు అత్యంత ధనికులు, బడా కార్పొరేట్లకు సకల సౌకర్యాలు దక్కుతున్నాయి. ఈ విపరీత పరిస్థితికి కారణం మోడీ సర్కార్ ఎంచుకున్న విధానాలు. దీంట్లో మార్పు రాకపోతే అసమానతలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని ఆక్స్‌ఫామ్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ) నివేదిక పేర్కొంది. ధనిక-పేద మధ్య ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు ఏం చేశాయి? అన్నదానిపై ఆక్స్‌ఫామ్-డీఎఫ్ఐ సంయుక్తంగా నివేదిక విడుదల చేసింది. 161 దేశాలకు సంబంధించి ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయం, పన్ను విధానాలు, కార్మిక హక్కులపై కీలక గణాంకాలు విడుదల చేసింది. అసమానతల్ని ఎదుర్కోవడానికి ఆయా ప్రభుత్వాలు ఎలాంటి పద్ధతుల్ని అనుసరించాయి? అన్నది ఇందులో ప్రస్తావించారు. 70శాతానికిపైగా విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా తగ్గించేశాయని లెక్క తేలింది.
ఆహార ధరలు
రెండింట మూడు వంతు దేశాలు కనీసవేతనాల్ని పెంచటంలో విఫలమయ్యాయి. మరోవైపు 95శాతానికిపైగా దేశాలు ధనికులు, బడా కార్పొరేట్లపై పన్నుల్ని పెంచలేదు. దాంతో ధనికులు మరింత సంపదను పోగేసుకున్నారు. ప్రపంచబ్యాంక్, ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం, పెరుగుతున్న ఆహార ధరల కారణంగా అదనంగా 6.5కోట్ల మంది పేదరికంలోకి ప్రవేశించవచ్చు. కోవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోతే..ఆర్థిక అసమానతలు శాశ్వతంగా ఉండిపోతాయని నివేదిక హెచ్చరించింది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిన కృషి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.