Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చేపడుతున్న రోజ్‌గార్ మేళా ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం చేపట్టిన చర్యల్లో ఓ కీలక మైలు రాయి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రోజ్‌గార్ మేళాను శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75 వేల మందికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వందేళ్లలో ఒకసారి వచ్చే కోవిడ్ లాంటి మహమ్మారి, దాని ప్రభావాలు వంద రోజుల్లో తొలగవని అన్నారు. ప్రపంచంలోని పెద్దపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. గత ఎనిమిదేళ్లలో తీసుకున్న ఆర్థిక, విధాన పరమైన నిర్ణయాల వల్ల ఈ సంక్షోభాన్ని మనదేశం అధిగమించగలదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పదో ఆర్థిక వ్యవస్థగా ఉండే భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని తెలిపారు. ఒకేసారి అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చే సాంప్రదాయం ప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో సెల్ఫ్ అటెస్టేషన్, ఇంటర్వ్యూల రద్దు వంటి చర్యలు యువతకు ఎంతో మేలు చేశాయన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 38 మంత్రిత్వశాఖల్లోని వివిధ విభాగాల్లో గ్రూప్ -ఎ (గెజిటెడ్), గ్రూప్ -బి (నాన్ గెజిటెడ్), గ్రూప్ సి స్థాయిల్లో కొత్తగా నియామకాలు చేపడుతోంది. కేంద్ర సాయుధ దళాల సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎల్‌డిసిలు, స్టెనోగ్రాఫర్లు, పిఎలు, ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, ఎంటిఎస్ల వంటి నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది.