Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించే మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమలు తీరు నిరుత్సాహపరుస్తున్నది. మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరితో ఈ ఏడాది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.5 కోట్ల మంది లబ్దిదారులకు ఈ పథకం కింద పని నిరాకరణకు గురయ్యారు. సాక్షాత్తు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
- 1.5 కోట్ల మందికి పని తిరస్కరణ
- రూ. 4254 కోట్ల లోటు బడ్జెట్
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రగణాంకాల పరిస్థితి
- కేటాయింపులు పెంచి.. నిధులను సకాలంలో విడుదల చేయాలి : విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా, లాక్డౌన్ వంటి ఆపత్కాలంలోనూ ఈ పథకం గ్రామీణ ప్రజలను ఎంతగానో ఆదుకున్నది. ఉపాధి లేని వారికి ఒక మార్గాన్ని చూపింది. అయితే, ఇలాంటి పథకంపై మోడీ సర్కారు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నది. ముఖ్యంగా, బడ్జెట్లో పథకానికి చేసే కేటాయింపులకు క్రమంగా కోత విధిస్తూ దీనిని నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నదని విశ్లేషకులు ఆరోపించారు.
కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ 20 వరకు ఉన్న సమాచారం) ఇప్పటి వరకు దాదాపు 1.5 కోట్ల మంది ఈ పథకం కింద పనిని పొందలేకపోయారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 2020-21, 2021-22 మహమ్మారి సంవత్సరాలలో ఈ పథకం కింద పని పెరిగింది. ఆ సమయంలోనూ పని తిరస్కరణలు కొనసాగాయి. దీంతో పని నిరాకరణకు గురైన వారి సంఖ్య పెరిగింది. 2020-21లో మొదటి మొత్తం లాక్డౌన్, తర్వాత సాధారణ కార్యకలాపాలపై కొనసాగిన పరిమితుల కారణంగా 13.3 కోట్ల మంది ఉపాధి హామీ కింద పనిని కోరుకున్నారు. అయితే, ఇందులో 2.1 కోట్ల మందికి పని లభించలేదు. 2021-22 రెండో మహమ్మారి సంవత్సరంలో 12.4 కోట్ల మంది పని కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోనూ దాదాపు 1.73 కోట్ల మందిని పనికి నిరాకరించారు. మహమ్మారికి ముందు చూసుకుంటే 2019-20లో 9.3 కోట్ల మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1.5 కోట్ల మందికి పని దొరకలేదు. 2018-19లో పని తిరస్కరణకు గురైన వారి సంఖ్య 1.3 కోట్లుగా ఉన్నది. అయితే, కరోనా తీవ్రత తగ్గటం, పరిస్థితులు దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్న ఈ తరుణంలోనూ పని తిరస్కరణకు గురైన వారి సంఖ్య అధికంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈనెల 21 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు) మొత్తం ఉపాధి దరఖాస్తుదారులలో 18 శాతం మందికి పని లభించలేదు.
అక్టోబరు 22 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పథకం కోసం రూ. 59,795 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్తో రూపొందించబడింది, గతేడాది నుంచి ఆలస్యంగా విడుదల చేసినవి. మొత్తం వాస్తవ వ్యయం రూ. 57,801 కోట్లుగా ఉన్నది. పెండింగ్లో లేదా చెల్లించాల్సిన బకాయి రూ. 6247 కోట్లు. అంటే దాదాపు రూ. 4,254 కోట్లు లోటులో ఉన్నదన్నమాట. అయితే, ఇది ఈ ఏడాది తొలి అర్ధ భాగానికి సంబంధించిన గణాంకాలు. ఏడాది ముగింపునాటికి ఈ లోటు మరింతగా పెరిగే అవకాశమున్నది.
ఇప్పటికే విడుదలై ఖర్చు చేసిన నిధులే కాకుండా.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లోటు బడ్జెట్లో ఉన్నాయి. తమిళనాడు (రూ. 1.79 లక్షల కోట్లు), పశ్చిమబెంగాల్ (రూ. 1.3 లక్షల కోట్లు), రాజస్థాన్ (రూ. 31,223 కోట్లు), మహారాష్ట్ర (రూ. 35,663 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ. 1.22 లక్షల కోట్లు), కర్నాటక (రూ. 65,573 కోట్లు) వంటి రాష్ట్రాలైతే భారీ లోటులో ఉన్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు మోడీ సర్కారు వ్యవహరిస్తున్న విధానమే కారణమని విశ్లేషకులు తెలిపారు. ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఏడూ బడ్జెట్లో తగిన స్థాయిలో కేటాయింపులు చేసి ఖర్చు చేయాలని సూచించారు. అయితే, కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అంతగా పట్టించుకోవటం లేదనీ, అందుకే ఈ ఉపాధి హామీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.