Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు ట్రస్టులకు చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ
న్యూఢిల్లీ : రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్జీసీటీ)లకు కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ రద్దు చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాందీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్ట్‌లకు ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఆర్జీఎఫ్, ఆర్జీసీటీకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 2020లో హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌పైనా దర్యాప్తు నిర్వహించినప్పటికీ, ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశీ నిధులను స్వీకరించడానికి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వల్ల ఈ రెండు ఎన్జిఓలు విదేశీ నిధులను స్వీకరించడానికి అనర్హులుగా మారాయి.
2020 జూన్ 15న గల్వాన్‌లో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించారు. చైనాకు భూభాగాన్ని అప్పగిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న ట్రస్టులపై బీజేపీ ఆరోపణలు చేసింది. ఆ ట్రస్ట్‌లకు 2005-06లో చైనా ప్రభుత్వం నుంచి విదేశీ నిధులు అందాయని విమర్శించింది. ఆరోపణలపై విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జులై 8న అంతర్ మంత్రిత్వ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన పలువురు అధికారులు ఉన్నారు. ఈ రెండు ట్రస్టులకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చలామణి (పీఎంఎల్ఏ) వంటి నేరాలను మంత్రిత్వ కమిటీ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 2021 డిసెంబర్లో దాఖలు చేసిన వార్షిక రిటర్న్‌ల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు ఎన్జీఓలు ఎలాంటి విదేశీ విరాళాలను స్వీకరించలేదు. అయితే వాటి ఖాతాల్లో ఆర్జీసీటీలో రూ.11.5 కోట్లు, ఆర్జీఎఫ్లో రూ.13.5 కోట్లు నగదు ఉన్నది. 1991లో ఆర్జిఎఫ్ను స్థాపించారు. దీనికి చైర్ పర్సన్‌గా సోనియా గాంధీ, ట్రస్టీల బోర్డులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి. చిదంబరం, మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సుమన్ దూబే, అశోక్ గంగూలీ ఉన్నారు. ఇది సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్రసాద్ రోడ్‌లోని జవహర్ భవన్లో ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు మద్దతుగా పని చేస్తోంది. 2002లో ఆర్జిసిటిని స్థాపించారు. ఇది కూడా జవహర్ భవన్లో ఉంది. ఈ ట్రస్ట్‌కు చైర్ పర్సన్‌గా సోనియా గాంధీ, బోర్డు సభ్యుడుగా రాహుల్ గాంధీ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తోంది. ఈ ట్రస్ట్ ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.