Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే కాళ్లు పట్టుకున్న బాధితురాలు
బెంగళూరు : తన సమస్యను పరిష్కరించాలని అడిగినందుకు ఒక మహిళను కర్నా టకలో బీజేపీ మంత్రి చాచిపెటి చెంపదెబ్బ కొట్టారు. వెంటనే ఆ మహిళ మంత్రి కాళ్లు పట్టుకున్నారు. బీజేపీకి చెందిన రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి వి సోమన్న ఆదివారం చమరాజ్నగర్ జిల్లాలోని హంగళలో భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మధ్నాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే మంత్రి ఆలస్యంగా రావడంతో రెండు గంటల తరువాత ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో సుమారు 175 మందికి టైటిల్స్ డీడ్స్ అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఒక మహిళ తనకు అర్హత ఉన్నా రెవిన్యూ శాఖ పట్టా ఇవ్వలేదని తన కష్టాలను చెప్పుకోవడానికి మంత్రి వద్దకు వచ్చింది. అయితే ఆమె కష్టాన్ని వినకుండా మంత్రి సోమన్న ఆమెను చెంపపై కొట్టారు. దీంతో మహిళ మంత్రి కాళ్లును పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్గా మారింది. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో బిజెపి నాయుకులు బహిరంగంగా ప్రజలపై దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత డిసెంబరులో న్యాయశాఖ మంత్రి జెసి మధుస్వామి ఒక మహిళా రైతుపై అసభ్యంగా ప్రవర్తించారు. ఇటీవలే సెప్టెంబరు 3న బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఒక మహిళను బెదిరిస్తూ, దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.