Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకునేందుకు కార్యాచరణ
- రాష్ట్రాల ఆర్థిక వనరులపై అధ్యయనం
న్యూఢిల్లీ : ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు, ఉచిత పథకాలను అడ్డుకునేందుకు 'కాగ్' (కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్)ను కేంద్రం రంగంలోకి దింపుతోంది. రాష్ట్రాల బడ్జెటేతర రుణాలు, రైట్ ఆఫ్‌లు మొదలైనవి బయటకు తీసుకొచ్చి, ఎన్నికల హామీలు, ఉచిత పథకాలు ఎలా అమలుజేస్తారన్న ప్రశ్నను లేవనెత్తాలని, దీనిని కాగ్ ద్వారా అమలుజేయాలని మోడీ సర్కార్ వ్యూహం రచిస్తోంది. ''రాష్ట్రాల ఆర్థిక వనరులపై చర్చ జరుగుతోంది. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల ఉచితాలు, సబ్సిడీలను అడ్డుకునే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. ఆడిట్ అడ్వైజరీ నివేదిక వచ్చాక ఏం చేయగలమన్నది తెలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 80శాతం పని పూర్తయింది'' అని కాగ్ తాజాగా ప్రకటించింది.రాష్ట్రాల ఉచిత పథకాలు, సబ్సిడీలను కాగ్‌లోని ఆడిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు, గ్రైండర్స్..మొదలైనవి వివిధ రాష్ట్రాల్లో పంపిణీ అవుతున్నాయి. సబ్సిడీల్లో ప్రస్తావనలేనివి ఇవి. వీటి వివరాలు ఎలా సేకరించాలి? ఎలాంటి పద్ధతులు తీసుకురావాలన్నదానిపై కాగ్ కసరత్తు చేస్తోంది.సబ్సిడీలు, ఉచితాలు, ఆఫ్ బడ్జెట్ రుణాలు, తగ్గింపులు...ఇవన్నీ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతాయని కేంద్రం భావిస్తోంది. ఎన్నికలవేళ ఆయా రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు, హామీలు, సబ్సిడీలను ప్రకటించకుండా అడ్డుపడాలని సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా కాగ్‌ను రంగంలోకి దింపింది. ఎన్నికల వాగ్దానాలు, ఆర్థిక ప్రభావం, అదనపు వనరుల సేకరణ..తదితర వివరాలు రాజకీయ పార్టీలు ఇవ్వాలని ఇప్పటికే ఈసీ కోరింది. కాగ్ సైతం ఇదే సూచన చేయడానికి సిద్ధమైంది. ఉచితాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.