Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్ ప్రదేశ్‌లో మోడీ బొమ్మతోనే ఎన్నికలకు...
- తీవ్రంగా పెరిగిన ప్రజా వ్యతిరేకత
- కాంగ్రెస్‌లో అంతర్గత పోరు
- బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
- హిమాచల్ నుంచి పక్కకెళ్లిన ఆప్
న్యూఢిల్లీ: అక్టోబర్ శీతాకాలం కంటే హిమాచల్‌లో ఎన్నికల వేడి పెరిగింది. సిమ్లా జాతీయ రహదారిపై చండీగఢ్ హిమాచల్‌లోకి వెళ్లే రోడ్లు, ప్రధాన కూడళ్లు, కొండలపై రాజకీయ పార్టీల భారీ బోర్డులను ఏర్పాటు చేశారు.అయితే బీజేపీ బోర్డులపై ప్రధాని మోడీ ముఖ చిత్రమే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రచార బోర్డులపై రాహుల్, ప్రియాంక గాంధీల పోటోలున్నాయి. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడిని ప్రమోట్ చేయకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్, ఉత్తరా ఖండ్ల తరువాత హిమాచల్‌లో కూడా రెండో సారి అధికారాన్ని నిలబెట్టు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాకపోతే తీవ్ర ప్రజావ్యతిరేకతతో కొట్టుమిట్టా డుతోంది. కాంగ్రెస్ మాత్రం తమకంటూ నాయకుడు లేకుండానే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆశలు పెట్టుకున్నది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. పొరుగు రాష్ట్రమైన హిమాచల్‌లో కూడా దూసుకుపోవాలని ప్రయ త్నించింది. అయితే ప్రచారంలో మాత్రం వెనుకబడింది. హిమాచల్‌లో పాగా వేయాలన్న ఆప్ యోచనకు అక్కడి పరిస్థితులు ఆది నుంచి ప్రతికూలంగా ఉన్నా యి. ఆప్ హిమాచల్ ప్రదేశ్ ఇన్చార్జి, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను సీబీఐ అరెస్టు చేసి జైళ్లో పెట్టింది. దీంతో డీలాపడ్డ ఆప్ తన దష్టి కేంద్రీకరణను గుజరాత్‌పైకి మjల్చింది. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని స్థానాల్లో ఆప్ ప్రభావం చూపుతోంది. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.
హిమాచల్‌లోని 68 స్థానాలకు గాను 2017లో బిజెపి 44 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 21 సీట్లకు తగ్గింది. సిపిఎం ఒక్క సీటు గెలుచుకుంది. 1985 నుండి హిమాచల్‌లో కాంగ్రెస్, బిజెపిలు ఒక పార్టీ తరువాత మరొక పార్టీ అధికారంలో ఉన్నాయి. అయితే ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకు మోడీ ఫోటోనే దిక్కని భావిస్తోంది. అయితే ఇటీవల ఉప ఎన్నికల్లో తిన్న ఎదురుదెబ్బ బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది. ఉప ఎన్నికల్లో ఒక లోక్‌సభ స్థానం, మూడు అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలయింది. సీనియర్ నేతలు ప్రేమ్‌కుమార్ ధుమాల్, శాంతకుమార్ తదితరులు వెనక్కి తగ్గడంతో బిజెపి పరిస్థితి దిగజారుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వీరభద్ర సింగ్ మరణంతో కాంగ్రెస్‌లో అంతటి పెద్ద నాయకుడు ఎవరూ కనబడటం లేదు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు బిజెపిలోకి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ సంస్థాగతంగా కూడా బలహీనపడింది. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కాజల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆశ్రరు శర్మ, పీసీసీ ఉపాధ్యక్షుడు రాంలాల్ ఠాకూర్, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పలువురు ఇటీవల కాంగ్రెస్‌ను వీడారు. హిమాచల్‌కు చెందిన సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
హిమాచల్‌లో ఐదేండ్ల బీజేపీ పాలనపై తీవ్రమైన ప్రజా వ్యతిరేక ఉన్నది. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్ష ఖాళీలు, మరోవైపు నిరుద్యోగం పెరగడంపై యువతీ, యువకులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. సీఎంఐఈ నివేదికల ప్రకారం బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పడు (2017)లో నిరుద్యోగ రేటు 0.5 శాతం ఉంటే, ప్రస్తుతం (సెప్టెంబర్) 9.2 శాతానికి పెరిగింది.
అలాగే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొత్త పెన్షన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల్లో తీవ్రంగా వ్యతిరేకత నెలకొంది. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ధరలు పెరుగుదల బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజల్లో తీవ్రంగా అసంతృప్తి నెలకొంది. ఎన్నికల్లో యాపిల్ రైతుల సంక్షోభం పెద్ద ఎత్తున్న ప్రభావం చూపునుంది. ఇటీవలి యాపిల్ రైతులు మద్దతు ధర కోసం పెద్ద పోరాటాన్నే నడిపారు. తాగునీటి పథకం ప్రయివేటీకరణ ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సైనిక కుటుంబాలు అగ్నిపథ్ వ్యతిరేకిస్తున్నాయి. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను డిమాండ్ చేస్తున్నాయి. డబ్బు పంచడంలో బీజేపీ ముందున్నప్పటికీ.. దాన్ని ఓట్లుగా మార్చుకోవడం అంత సులువు కాదు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు హౌరాహౌరీగా ఉన్నప్పటికీ హిమాచల్‌లో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే మైనార్టీ అంశం హిమాచల్‌లో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటు. హిమాచల్‌లో మైనార్టీల ప్రభావం లేకపోవడంతో మత విభజన సాధ్యం కాలేదు. ఇక్కడ అందరూ మెజార్టీ మతానికి చెందిన వారే ఉండటంతో మతం ప్రసక్తి లేకుండా ఎన్నికల జరుగుతాయి.
ఇక్కడ 33 శాతం రాజ్‌పుత్‌లు, 18 శాతం బ్రాహ్మణులు, 25 శాతం దళితులు, 14 శాతం ఓబీసీలు ఉన్నారు. ఈ నాలుగు సామాజిక వర్గాలే రాష్ట్ర రాజకీయాలను నిర్ణయిస్తాయి. సీపీఐ(ఎం) 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. తియోగ్ స్థానాన్ని తిరిగి గెలుస్తామని సీపీఐ(ఎం) నేత, సిమ్లా మాజీ డిప్యూటీ మేయర్ తికాంతర్ సింగ్ పన్వార్ తెలిపారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగుతాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడి అవుతాయి.