Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలవేళ..ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న ప్రధాని మోడీ
- ఇప్పుడు..10 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామంటూ ప్రకటన
- ఆందోళనబాట పడుతున్న యువత దృష్టి మరల్చడమే ప్రధాని వ్యూహం : రాజకీయ విశ్లేషకులు
- మేక్ ఇన్ ఇండియా ఎంత నిజమో..ఇదీ అంతే..
- 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత హడావిడి
న్యూఢిల్లీ : ఉపాధి అవకాశాలు లేక యువత ఆందోళన చెందుతోంది. బి.టెక్, ఎం.టెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చదివినా..చిన్న ఉద్యోగం కూడా ప్రభుత్వరంగంలో దొరకటం లేదన్న అసంతృప్తి యువతను వేధిస్తోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన ప్రధాని మోడీ...గత 8ఏండ్లుగా దానిపై మాట్లాడలేదు. కొత్తగా 'రోజ్‌గార్ మేళా' ప్రారంభించారు. నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఖాళీలున్నా.. కేంద్రం భర్తీ చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నవేళ.. కేంద్రం కొత్త పథకానికి తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉపాధి సమస్యపై ఎక్కడికి వెళ్లినా..అనేక గొంతులు ప్రశ్నిస్తున్నాయి. దీంతో మోడీ సర్కార్ కొత్త మోసానికి తెరలేపిందని విశ్లేషకులు చెబుతున్నారు. 10లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నామని మోడీ సర్కార్ ప్రచారానికి తెరలేపింది. భారత్‌లో తీవ్రరూపం దాల్చిన ఉపాధి సమస్యకు ఇది పరిష్కారం కాదని, కేవలం రాజకీయాల కోసం చేస్తున్న హంగామా తప్ప మరోటి కాదని విమర్శలు వస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా అంటూ దేశంలో ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటిదేనని...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యువత ప్రశ్నించకుండా, వారి దృష్టి మరల్చడానికి వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఏమిటీ రోజ్‌గార్..
10లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నామని గత శనివారం ప్రధాని మోడీ రోజ్‌గార్ మేళాను అధికారికంగా ప్రారంభించారు. దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. మొదటి దశలో భాగంగా 38 కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లోని 75వేల ఖాళీల్ని భర్తీ చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని గత కొన్నాండ్లుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడీ రోజ్‌గార్ మేళా వాటి భర్తీ కోసమే అన్నట్టు మీడియాలో కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా బీజేపీ అధిష్టానం మొదలుపెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. 8ఏండ్లలో గుర్తుకు రానిది, ఇప్పుడు హఠాత్తుగా రోజ్‌గార్ మేళా ఏంటని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హడావిడి ఎక్కువగా కనపడుతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉద్యోగ మేళా పేరు చెప్పుకుంటూ ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తున్నారు.
యువత ఆగ్రహం చల్లారుతుందా?
ఉపాధి సమస్యతో బాధపడుతున్న యువత మోడీ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఉంది. దీనిని చల్లార్చడానికి మోడీ సర్కార్ రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తోంది. ఇలాగే సెప్టెంబర్ 2014లో 'మేక్ ఇన్ ఇండియా' పేరుతో హడావిడి చేసింది. దీని ద్వారా ఉత్పత్తిరంగం విస్తరించి..కొత్త ఉద్యోగాలు ఏర్పడి ఉంటే, మనదేశంలో నిరుద్యోగం, ఉపాధి సమస్య తీవ్రస్థాయికి ఎందుకు చేరుకుంటుంది? రోజ్‌గారీ మేళాపై యువతలో నమ్మకం లేదు. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలేనా? ప్రయివేటు రంగంలో స్టార్టప్‌ల ద్వారా ఏర్పడేవి రోజ్‌గార్ మేళా ఖాతాలో వేస్తారా?అన్నది తెలియదు. 'అగ్నిపథ్' నియామకాలు కూడా ఇందులో కలుపుతోంది. రైల్వే నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఉత్తరప్రదేశ్, బీహార్‌లో పెద్దఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. పీఈటీ ఉద్యోగాలను యోగి సర్కార్ ప్రకటించింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. కాగా యూపీలో 37లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ పరీక్షలకు నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఇబ్బందిపడినట్టు మీడియా కథనాలు వచ్చాయి.