Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీ వీసీల రాజీనామా ఆదేశాలు చెల్లవన్న హైకోర్టు
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు (వీసీలు) తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆయన జారీ చేసిన ఆదేశాలు చెల్లవని జస్టిస్ దేవన్ రామచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది. వైస్ ఛాన్సలర్లు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ నిర్ధేశించిన ప్రకియను అనుసరించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు వీసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, వాటిపై వీసీల వివరణ తీసుకోవాలని, వివరణలను పరిశీలించిన తరువాతే వారిని కొనసాగించాలా,తొలగించాలా అన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రకియ అంతా పూర్తయ్యి, గవర్నర్ నుంచి తుది అధికారిక ఉత్తర్వులు వచ్చేంతవరకు వీసీలు తమ పదవుల్లో కొనసాగవచ్చని పేర్కొంది. ధర్మాసనంలో విచారణ జరుగుతున్న సమయంలోనే షోకాజ్ నోటీసులు వీసీలకు పంపినట్టు గవర్నర్ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. దీంతో రాజీనామాలకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపి వేసినట్టు గా భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అంతకుముదు వీసీల రాజీనామాలను గవర్నర్ కోరడం పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాజీనామాలను బలవంతంగా ఎలా కోరుతారని ప్రశ్నించింది. అదే సమయంలో గవర్నర్‌కు తమను తొలగించే అధికారం లేదని, ఛాన్సలర్ హోదాలో తమకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం కూడా లేదంటూ పిటిషనర్లు చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించలేదు. భవిష్యత్తులో విచారణ అవసరమైతే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
ఆర్ఎస్ఎస్ మనిషిలా వ్యవహరిస్తున్నారు : సీఎం పినరయి విజయన్
9మంది వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ వ్యవహారశైలిని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుబట్టారు. ''గవర్నర్ చర్య అప్రజాస్వామికం. ఆర్ఎస్ఎస్కు ఏజెంట్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ అధికారాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్ పదవిని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయటం కోసం వాడరాదు'' అని అన్నారు.