Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రాత్మక రైతు పోరాటానికి రెండేండ్లు : ప్రకటించిన ఎస్కేఎం
న్యూఢిల్లీ : చారిత్రాత్మక రైతు పోరాటానికి రెండేండ్లు కావస్తున్న సందర్భంగా నవంబర్ 26న రాజ్ భవన్ మార్చ్‌లకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపుని చ్చింది. మంగళవారం నాడు ఎస్కేఎం సమన్వయ కమిటీ, ట్రాఫ్టింగ్ కమిటీల సమావేశం ఆన్లైన్లో జరిగింది. ఈ సమావేశంలో ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, అశోక్ ధావలే, దర్శన్ పాల్, యుధ్వీర్ సింగ్, మేధా పాట్కర్, రాజారామ్ సింగ్, అతుల్ కుమార్ అంజన్, సత్యవాన్, అవిక్ సాహా, సుఖ్ దేవ్ సింగ్, రమీందర్ సింగ్, వికాస్ శిశిర్, సునీలం హాజరయ్యారు. ఎస్కేఎం నేతృత్వంలోని చారిత్రిక రైతు పోరాటానికి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న రాజ్భవన్లకు పెద్ద ఎత్తున రైతుల పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో రాజ్‌భవన్ మార్చ్‌లకు సన్నాహాలు జరుగుతున్నాయనీ, అన్ని రాష్ట్రాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయని ఎస్కేఎం నేతలు తెలిపారు. రాజ్‌భవన్ మార్చ్‌లకు తుది రూపం ఇచ్చేందుకు, గవర్నర్లకు సమర్పించాల్సిన మెమోరాండంను ఖరారు చేసేందుకు నవంబర్ 14న ఢిల్లీలో ఎస్కేఎం సమావేశాన్ని నిర్వహించనుందని పేర్కొన్నారు. అలాగే ఈ సమావేశంలో ఎస్కేఎం తన మార్గదర్శకాలను కూడా ఖరారు చేస్తోందనీ, దీనిపై సమన్వయ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు మధ్య చర్చ జరుగుతోందని తెలిపారు. అటవీ సంరక్షణ చట్టం నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులను ఎస్కేఎం ఈ సమావేశం ఖండించింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీ సంఘాలకు, అమరవీరుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న సంఘీభావం తెలియజేయాలని ఎస్కేఎం నిర్ణయించింది. 380 రోజుల పాటు రైతుల పోరాటంలో పాల్గొన్న రైతు నాయకుడు పరమజీత్ సింగ్ మృతికి సమావేశం సంతాపం తెలిపింది.